రేషన్ బియ్యాన్ని బార్డర్ దాటిస్తున్నరు!

రేషన్ బియ్యాన్ని బార్డర్ దాటిస్తున్నరు!

మహబూబ్​నగర్‌‌‌‌‌‌‌‌, వెలుగు : రేషన్ ​బియ్యం పక్కరాష్ట్రాలకు తరలిపోతున్నది. మహబూబ్​నగర్ ​జిల్లాలో మాఫియాగా ఏర్పడిన కొందరు వ్యక్తులు లబ్ధిదారుల నుంచి బియ్యాన్ని సేకరించి రాత్రికి రాత్రే ఆటోలు, డీసీఎంలలో కర్ణాటక, ఏపీకి తరలించి క్యాష్​ చేసుకుంటున్నారు.  బార్డర్‌‌‌‌‌‌‌‌లో చెక్‌‌‌‌పోస్టులు ఉన్నా ఆఫీసర్లు కనీసం తనిఖీలు చేయకపోవడంతో దందా యథేచ్ఛగా సాగుతోంది.  పోలీస్‌‌‌‌ రెగ్యూలర్‌‌‌‌‌‌‌‌ చెకప్‌‌‌‌లో కొన్ని చోట్ల పట్టుబడడం తప్ప.. స్పెషల్ నిఘా లేకపోవడంతో వందల క్వింటాళ్లు బార్డర్ దాడుతున్నాయి.  సివిల్ సప్లై శాఖ సమాచారం మేరకు జిల్లాలో జనవరి నుంచి సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ వరకు మొత్తం 832.48 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్​చేసి 27 కేసులు నమోదు చేశారు.  పట్టుబడ్డ బియ్యం విలువ రూ.17,16,950గా నిర్ధారించారు.  వారం క్రితం దేవరకద్ర శివారులోని వ్యవసాయ పొలాల్లో నిల్వ ఉంచిన 48 బస్తాల బియ్యం,  బుధవారం తెల్లవారుజామున మిడ్జిల్​ మండలం మున్ననూరు టోల్​ప్లాజా వద్ద ఐదు ఆటోలలో తరలిస్తున్న  36 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. 

గ్రూపులుగా ఏర్పడి..

రేషన్​ మాఫియాకు జిల్లాలోని ప్రతి మండలంలో గ్యాంగ్స్ ఉన్నాయి. వీరు ఊర్లలలో ఆటోలలో తిరిగి కిలోకు రూ.8 నుంచి రూ.10 వరకు చెల్లించి లబ్ధిదారుల నుంచి రేషన్​ బియ్యాన్ని సేకరిస్తారు. ఈ బియ్యాన్ని వ్యవసాయ పొలాలతో పాటు శివారు ప్రాంతాల్లో షెడ్లు ఏర్పాటు చేసి స్టోర్ చేస్తున్నారు. అర్ధరాత్రి దాటాక ఆటోలు, మినీ డీసీఎంలు, డీసీఎంలలో కర్ణాటకలోని రాయచూర్, ఏపీ, నల్లగొండ జిల్లాతో పాటు స్థానికంగా ఒప్పందం చేసుకున్న రైస్​మిల్లులకు తరలిస్తున్నారు.  వీరి నుంచి కిలోకు రూ.15 నుంచి రూ.20 వరకు వసూలు చేస్తున్నారు. ఈ దందా సజావుగా సాగేందుకు మాఫియా  సివిల్​ సప్లై శాఖ, విజిలెన్స్​, ఎన్​ఫోర్స్​మెంట్‌‌‌‌లోని కొందరు ఆఫీసర్లు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 

నామమాత్రంగా చెక్​పోస్టులు

ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాలు సరిహద్దులుగా ఉన్నాయి.  కర్ణాటకకు సరిహద్దు ప్రాంతాలైన గట్టు, కృష్ణ, ఏపీకి సరిహద్దులోని అలంపూర్​పరిధిలో చెక్​పోస్టులు ఉన్నా బియ్యం అక్రమ రవాణా ఆగడం లేదు. కొన్ని చెక్‌‌‌‌పోస్టుల వద్ద  పోలీసులు అందుబాటులో ఉండడం లేదు. మిగతా చోట్లా డ్యూటీలో ఉన్నా నామమాత్రపు తనిఖీలతో వదిలేస్తున్నారు.  సివిల్ సప్లై, విజిలెన్స్‌‌‌‌ ఆఫీసర్లు అయితే అటువైపు కన్నెత్తి చూడడం లేదు. కాగా,  పైఆఫీసర్లు తనిఖీలకు వచ్చినప్పుడు కొందరు ఆఫీసర్లు మాఫియాకు ముందస్తుగానే  సమాచారం ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  ఒకవేళ పట్టుబడ్డా చిన్నపాటి కేసులతో వదిలేస్తున్నారు. 

గద్వాలలో జోరుగా...

గద్వాల జిల్లాలో రేషన్ బియ్యం దందా జోరుగా కొనసాగుతోంది. జిల్లాకు ఆనుకొని ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు ఉండడంతో మాఫియాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఇక్కడ లబ్ధిదారుల నుంచి సేకరించిన బియ్యమే కాదు.. డైరెక్ట్‌‌‌‌గా స్టాక్‌‌‌‌ పాయింట్ల నుంచి తరలిస్తున్నారు. మూడునాలుగు రైస్‌‌‌‌ మిల్లులు అడ్డాగా చేసుకొని కొంత బియ్యం పక్కరాష్ట్రాలకు తరలిస్తుండగా.. మరికొంత సీఎంఆర్‌‌‌‌‌‌‌‌కింద ప్రభుత్వానికే పంపిస్తున్నారు. ఆఫీసర్లు కేసులు పెట్టినా ఇక్కడి లీడర్లు తెల్లారేసరికి తారుమారు చేస్తున్నారు. రేఖ రైస్‌‌‌‌ మిల్లులో రేషన్ బియ్యం తారుమారు వ్యవహారం ఇప్పటికీ తేలకపోవడమే ఇందుకు నిదర్శనం.  ప్రతిరోజు ఎదో ఒకచోట రేషన్ బియ్యం వెహికిల్స్ పట్టుబడుతున్నా..  ఇతరుల పేర్లపై కేసు నమోదు చేసి పీడీ యాక్ట్ నుంచి 
తప్పించుకుంటున్నారు. 

బియ్యం అక్రమ రవాణాను అడికడ్తం

జిల్లాలో  రేషన్ అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టినం.  పోలీసుల సహకారంతో జిల్లాలోని చెక్ పోస్టుల వద్ద నిఘా ఏర్పాటు చేసినం. టాస్క్ ఫోర్స్ టీంతో రేషన్ షాపులపై పర్యవేక్షణ చేస్తున్నం.  ఎవరైనా రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటం.     
- వనజాత, మహబూబ్‌‌నగర్ డీఎస్‌‌వో