
2018 దసరా నాడు రావణ దహనం చూస్తుండగా.. దూసుకొచ్చిన రైలు
క్షణాల్లో 60 మంది మృతి.. నాడు అమృత్ సర్ లో విషాదమైన వేడుక
నేటికీ న్యాయం జరగలేదని బాధితుల నిరసనలు
ఆప్తులను పోగొట్టుకున్నాం.. మేమూ అక్కడే ప్రాణాలు వదిలేస్తామంటూ కంటతడి
అమృత్ సర్: సంతోషాల పండుగ.. విజయ దశమి. దేశమంతా రావణ దహనాలు జరుగుతున్నాయి. చెడుపై మంచి విజయాన్ని తలుచుకుంటూ దసరా సంబురంలో మునిగితేలుతున్నారు. కానీ ఈ రోజును తలుచుకుంటేనే పంజాబ్ లోని అమృత్ సర్ లోని కొన్ని కుటుంబాలకు కంట నీరు ఆగడం లేదు. దసరా సందడి వారి ముఖాల్లో కరువైంది. చెప్పలేని విషాదం కనిపిస్తింది.
ఏడాది క్రితం.. విషాదమైన సంబురం
వైభవంగా జరుగుతున్న దసరా వేడుక.. విషాదంగా మారిన క్షణమది. రావణ దహనం చూసి.. చెడుపై విజయాన్ని కనులారా చూద్దామని వచ్చిన 60 మందిని రైలు రూపంలో క్షణాల్లో మృత్యువు కబళించిన రోజు అది. ఏడాది క్రితం దసరా పండుగ నాడు పంజాబ్ రాష్ట్రం అమృత్ సర్ లోని చౌరా బజార్లో విషాద ఘటన బాధిత కుటుంబాల కళ్లలో ఇంకా మెదులుతోంది.
2018 అక్టోబరు 19న (దసరా) రాత్రి ఇక్కడి చౌరా బజార్ ధోబీ ఘాట్ గ్రౌండ్ లో రావణ దహనం వైభవంగా జరుగుతోంది. ఆ వేడుకకు మాజీ క్రికెటర్ నవజోత్ సిద్ధు భార్య నవజోత్ కౌర్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సంబురాన్ని చూసేందుకు భారీగా జనం వచ్చారు. ఆ వెలుగుల జిలుగులు చూస్తూ తాము రైలు పట్టాలపై నిల్చున్న సంగతి కూడా మర్చిపోయారు కొందరు. అదే టైమ్ లో వేగంగా ట్రైన్ దూసుకొచ్చింది. క్షణాల్లో పదుల సంఖ్యలో జనాలు ప్రాణాలు వదిలారు. ఈ ఘటనలో మొత్తం 60 మంది మరణించగా.. 70 మంది గాయపడ్డారు.
ఆదుకోవాలంటూ నేడు ర్యాలీ
ఏడాది గడిచిపోయింది. మళ్లీ దసరా వచ్చేసింది. దేశమంతా సంబురాల్లో మునిగిపోయింది. కానీ ఆ విషాదాన్నే గుర్తు చేస్తోంది రావణ దహన సందడి. కారణం నేటికీ వారికి న్యాయం జరగలేదు. కనీసం తమకు ఇస్తామన్న నష్ట పరిహారం కూడా ఇంకా అందలేదని మంగళవారం అమృత్ సర్ లో నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చేలేదంటూ పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మా వాళ్లని పోగొట్టుకున్న చోటే నిరసనకు దిగుతాం
దాదాపు ఏడాది గడిచిపోయినా తమ న్యాయం జరగలేదని బాధితులు చెబుతున్నారు. అధికారుల తమను తిప్పిన చోట తిప్పకుండా తిప్పుకుంటున్నారని అన్నారు. ఇక విసిగిపోయామని, తామ వాళ్లను పోగొట్టుకున్న చోటే రైలు పట్టాలపై నిరసనకు దిగుతామని చెప్పారు.
నా బిడ్డని పోగొట్టుకున్నా.. నేనూ చావాడానికి సిద్ధం
‘నిరుడు దసరా నాడు నా బిడ్డ అమృత్ పాల్ సింగ్ ఇక్కడ వేడుకలు చూడడానికి వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. ప్రభుత్వం నాడు ఇంట్లో ఒకరికి జాబ్ ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పటికీ న్యాయం చేయలేదు. మేం ఘటన జరిగిన చోటుకి వెళ్తున్నాం. అదే రైలు పట్టాల దగ్గర చనిపోతాం’ అంటూ జోగీందర్ సింగ్ అనే ఓ తండ్రి కంటతడి పెట్టుకున్నాడు.
శాంతించండి: డీసీపీ
బాధితులు శాంతించాలంటూ అమృత్ సర్ డీసీపీ జగ్మోహన్ సింగ్ కోరారు. వారికి న్యాయం జరుగుతుందని, నిరసనలు మాని, పండుగ చేసుకోవాలని సూచించారు. ఎటువంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా.. రైల్వే స్టేషన్ సహా ఘటన జరిగి ప్రాంతంలోనూ పోలీసులను పెట్టామని చెప్పారాయన. రైల్వే పోలీసులను కూడా అప్రమత్తం చేశామన్నారు.