
కేజీయఫ్, సలార్ లాంటి సినిమాలతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసిన రవి బస్రూర్.. ‘వీర చంద్రహాస’ అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో ఓంకార్ మూవీస్ బ్యానర్‌పై ఎన్.ఎస్.రాజ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 18న కన్నడలో విడుదలైన ఈ చిత్రం త్వరలో తెలుగులో విడుదల కాబోతోంది. ఎమ్‌వీ రాధాకృష్ణ తెలుగులో విడుదల చేస్తున్నారు. శుక్రవారం తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను హీరో విశ్వక్ సేన్ విడుదల చేసి బెస్ట్ విషెస్ చెప్పాడు.
మహాభారతంలో అశ్వమేధ యాగానికి అర్జునుడి సైన్యంతో పాటు వెళ్లి సాయం చేసిన చంద్రహాస అనే రాజు కథ ఇది. కన్నడ ఇతిహాసమైన జైమినీ భారతంలో ఈ పాత్ర ప్రస్తావన ఎక్కువ ఉండడంతో పాటు కన్నడ యక్షగాన నాటకాలలో ఎక్కువగా ప్రదర్శిస్తారు. ఆ కథను యక్షగానాల తరహా చిత్రీకరణతో రవి బస్రూర్ సినిమాగా తెరకెక్కించాడు. ఇలా యక్షగాన కళను పూర్తి వైభవంతో వెండితెరపైకి రావడం ఇదే మొదటిసారి.