
న్యూఢిల్లీ: ఫ్రంట్ పుట్ టెక్నిక్‌లో సర్దుబాట్లు చేసుకోవడం వల్లే కేఎల్ రాహుల్ ఇంగ్లండ్‌లో మెరుగ్గా ఆడుతున్నాడని టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి అన్నాడు. రాబోయే మూడు, నాలుగేళ్లు తను టాప్ ప్లేస్‌లో కొనసాగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రాహుల్ 357 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఓ ఫిఫ్టీ కొట్టాడు. సగటు 62.50గా ఉంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, జామీ స్మిత్ తర్వాత అత్యధిక రన్స్ చేసిన నాలుగో బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.
‘రాహుల్ ఫ్రంట్ ఫుట్, స్టాన్స్‌లో స్వల్పంగా సర్దుబాట్లు చేసుకున్నాడు. దీనివల్ల డిఫెన్స్ మెరుగైంది. బ్యాట్‌ను క్లీన్‌గా బయటకు తీసుకురావడానికి వీలు కలుగుతోంది. మిడ్ వికెట్‌లోకి ఆడినప్పుడు కూడా బ్యాట్ పూర్తి ఓపెన్‌గా ఉంటుంది. ఈ కొత్త టెక్నిక్ వల్ల బౌల్డ్ కావడం, ఎల్బీ అవ్వడం వంటి చాన్సెస్ తగ్గాయి. ఇప్పుడు బ్యాట్ ముఖాన్ని పూర్తిగా మూయాల్సిన పనిలేదు. గతంలో లాగా ఔటయ్యే పరిస్థితులు ఇప్పుడు ఉండవు’ అని శాస్త్రి పేర్కొన్నాడు. ఇంగ్లండ్ పరిస్థితుల్లో తరచుగా బాల్ ఎక్కువగా సీమ్ కాకపోయినా, కదిలే డెలివరీలను ఎదుర్కొనే సాంకేతిక నైపుణ్యం రాహుల్‌కు ఉందన్నాడు.
టెక్నికల్‌గా రాహుల్ చాలా మెరుగైనవాడని కితాబిచ్చాడు. కొత్త టెక్నిక్ వల్ల రాబోయే కొన్నేళ్లు తన బ్యాటింగ్‌తో టాప్‌లో కొనసాగుతాడన్నాడు. ‘రాహుల్ శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేసిన వ్యక్తి ఎవరూ లేరని నేను అనుకుంటున్నా. అంత నైపుణ్యం ఉండి కూడా రాణించకపోవడం ప్రజలను చికాకు పెట్టింది. కానీ ఈ సిరీస్‌లో అతని అత్యుత్తమ ఆటను చూస్తున్నారు. ఇప్పట్నించి రాహుల్ సగటు 50 దగ్గరగా ఉంటుంది. అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. కాబట్టి ఈ మూడు, నాలుగేళ్లు అతనివే’ అని శాస్త్రి వ్యాఖ్యానించాడు. ఇప్పటివరకు 61 టెస్ట్‌లు ఆడిన 33 ఏళ్ల రాహుల్ 10 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలతో, 35.3 సగటుతో 3632 రన్స్ చేశాడు.