2026 వరల్డ్ కప్ కు నెల రోజుల సమయం మాత్రమే ఉంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో తొలిసారి 20 జట్లు ఆడుతుండడంతో భారీ హైప్ నెలకొంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. టోర్నీ ఇండియాలోనే జరుగుతుండడంతో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా టైటిల్ నిలబెట్టుకుంటుందని ఫ్యాన్స్ ఎంతో ఆతృత్తగా ఎదురు చూస్తున్నారు. మరోసారి ఇండియా, పాకిస్థాన్ ఒకే గ్రూప్ లో ఉండడంతో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పక్కా. అయితే టీ20 వరల్డ్ కప్ లో ఇండియా మ్యాచ్ లను చూసే ఆసక్తి ఫ్యాన్స్ కు ఉండదని టీమిండియా మాజీ ప్లేయర్ రవి చంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ ఇలా అన్నాడు.." ఈ సారి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లను ఎవరూ చూడబోరు. ఇండియా వర్సెస్ యుఎస్ఎ, ఇండియా వర్సెస్ నమీబియా లాంటి మ్యాచ్ లు ఫ్యాన్స్ కు ఉత్సాహాన్ని ఇవ్వవు. ఇవి అభిమానులను వరల్డ్ కప్ నుంచి దూరం చేసే మ్యాచ్ లు. గతంలో ప్రపంచ కప్‌లు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగేవి. అభిమానులను ఆకర్షించడానికి ఇలా చేసేవారు. అప్పుడు టీమిండియా మొదటి రౌండ్ లో ఇంగ్లాండ్ లేదా శ్రీలంక లాంటి పటిష్టమైన జట్లతో మ్యాచ్ లు ఆడేది. అలాంటి మ్యాచ్ లు చూడడానికి చాలా వినోదంగా ఉంటాయి".అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో అన్నారు.
Also Read : అదనంగా రెండు టీ20 మ్యాచ్ లు.. తుఫాన్ భాదితుల కోసం శ్రీలంకతో సిరీస్‌కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్
ఈ సారి ఈ మెగా టోర్నీలో 20 జట్లు తలపడనున్నాయి. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, యూఏఈ, ఒమన్, వెస్టిండీస్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, ఇటలీ, నేపాల్, పాకిస్థాన్ జట్లు టోర్నమెంట్ లో భాగం కానున్నాయి. భారత్‌లో జరిగే మ్యాచ్ లు 5 స్టేడియాల్లో జరుగుతాయి. అహ్మదాబాద్, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయి స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇక శ్రీలంక లో 3 వేదికల్లో నిర్వహించనున్నారు. ప్రారంభ, ఫైనల్ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు.
