IPL 2024: పాండ్యాకు పెరుగుతోన్న మద్దతు.. అభిమానులకు అశ్విన్ చురకలు

IPL 2024: పాండ్యాకు పెరుగుతోన్న మద్దతు.. అభిమానులకు అశ్విన్ చురకలు

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా నియమితులైన హార్దిక్ పాండ్యాకు ఏదీ కలిసిరావడం లేదు. ఒకవైపు ఓటములు, మరోవైపు సహచర ఆటగాళ్ల నుంచి మద్ధతు కరువవ్వడం.. దీనికి తోడు మైదానంలో ప్రేక్షకుల నుండి దుర్భాషలు ఎదురవుతున్నాయి. ఒక ఆటగాడిగా వీటిని పట్టించుకోనవసరం లేనప్పటికీ.. వ్యక్తిగతంగా అతన్ని, అతని కుటుంబాన్నినెటిజన్లు టార్గెట్ చేస్తుండటం తీవ్ర వివాదాస్పదం అవుతోంది. ఈ పరిణామాలపై అతనికి మద్దతు కూడా పెరుగుతోంది. 

నెటిజెన్స్.. పాండ్యాను ట్రోల్ చేయడాన్ని సోనూ సూద్ తప్పు పట్టారు. అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను, దేశ ప్రజలను తలెత్తుకునేలా చేసేది వారేనని, అలాంటి వారిని గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. గెలిచిన రోజు పొగడ్తల్లో ముంచెత్తడం, ఓడిన రోజు కించపరిచేలా వ్యవహరించడం సరికాదని సూచించారు. అలా చేయడం వల్ల తాము ఓడిపోయినట్టు గుర్తించాలని హితవు పలికారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. పాండ్యాకు మద్దతుగా నిలిచారు. 

అభిమానులు సహనం పాటించాలని, అసహ్యకరమైన మార్గాన్ని ఎంచుకోవద్దని అశ్విన్ కోరారు. హార్దిక్‌పై జరుగుతున్న ద్వేషాన్ని అరికట్టేందుకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం కానీ, ఆటగాళ్లు కానీ బయటకు వచ్చి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని తాను భావించడం లేదని అశ్విన్ పేర్కొన్నాడు.

అభిమానుల ఆలోచనా ధోరణి మారాలి

"ఇలా మరే దేశంలోనైనా జరగడం మీరు చూశారా? జో రూట్, జాక్ క్రాలీ ఫ్యాన్స్ గొడవపడటం ఎప్పుడైనా చూశారా? లేదా జో రూట్, జోస్ బట్లర్ ఫ్యాన్స్ పోట్లాడుకోవడం చూశారా..? భారత అభిమానుల్లో ఏంటి ఈ ధోరణి..? ఇలాంటి ఘటనలు నేను చాలా సార్లు చూశాను. అభిమానులు ఈ దుర్మార్గపు మార్గాన్ని ఎప్పుడూ ఎంచుకోకూడదు. ఆటగాళ్ళు ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో గుర్తుంచుకోవాలి.." 

"నాకు అర్థం కాలేదు. మీరు ఒక ఆటగాడిని ఇష్టపడకపోతే ఒక జట్టు ఎందుకు క్లారిటీ ఇవ్వాలి? ఇంతకు ముందు ఎన్నడూ ఇలా జరగలేదు. (సౌరవ్)గంగూలీ.. సచిన్ (టెండూల్కర్) కింద ఆడాడు. వీరిద్దరూ రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో ఆడారు. కొన్నాళ్లకు ఈ ముగ్గురూ అనిల్ కుంబ్లే ఆధ్వర్యంలో ఆడారు. చివరకు వీరంతా ధోనీ కింద ఆడారు. ధోనీ కూడా విరాట్ సారథ్యంలో ఆడారు.. అలా ఆడినంత మాత్రానా తప్పు కాదు..అభిమానులు తమ హీరోల విజయాన్ని ఆస్వాదించాలి అంతేకానీ, మరొక ఆటగాడిని అణగదొక్కడం కోసం కాదు.." అని అశ్విన్ చెప్పుకొచ్చారు. దేశం నుండి ఈ ధోరణి కనుమరుగవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడారు.