
ప్రభుత్వానికి ఎయిర్ బస్ ల మీద ఉన్న ప్రేమ ఎర్ర బస్సుల మీద లేదని తెలంగాణ టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడిన ఆయన ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ద్వజమెత్తారు. గతంలో ఆర్టీసీ రూట్ లను ప్రైవేట్ పరం చేసి నీలం సంజీవ రెడ్డి పదవి కోల్పోయారని గుర్తు చేశారు. ఆర్టీసీ సమస్యలపై కనీసం మంత్రివర్గ ఉప సంఘం కూడా వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాల మీద రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కు ఎంత అవగాహన ఉందో తనకు తెలియదన్నారు. సమ్మెను నిర్విర్యం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని, అందుకు దాన్ని కౌంటర్ చెయ్యాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మంత్రులు వాళ్ల శాఖల గురించి మాట్లాడరు కానీ సంబంధం లేని ఆర్టీసీ మీద మాట్లాడతారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టీడీపీ సంపూర్ణ మద్దతిస్తుందని రావుల హామి ఇచ్చారు.