వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు.. ఆర్అండ్ బీ చర్యలు షురూ

వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు.. ఆర్అండ్ బీ చర్యలు షురూ

ఆర్ అండ్ బీ రోడ్ల రిపేర్లకు టెండర్లు..రూ.300 కోట్లతో 26 ప్యాకేజీలుగా విభజన
ఎస్ టీఎంఎఫ్ కింద రూ.300 కోట్లతో 26 ప్యాకేజీలుగా విభజన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టడానికి ఆర్ అండ్ బీ చర్యలు షురూ చేసింది. ఎస్ టీఎంఎఫ్ (షార్ట్ టర్మ్ మెయింటెనెన్స్ ఫండ్) కింద రోడ్ల మరమ్మతు పనులకు రూ.300 కోట్లు కేటాయించింది. ఆర్అండ్ బీ అధికారులు వీటిని 26 ప్యాకేజీలుగా డివైడ్ చేసి టెండర్లు పిలిచారు. ఆరు నెలల్లో మరమ్మతులు పూర్తి చేసేలా ఈ పనులకు టెండర్లను ఫైనల్ చేయనున్నారు. 

కాగా, వీటిలో రూ.160 కోట్ల పనులకు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేసినట్టు ఆర్అండ్ బీ అధికారులు చెబుతున్నారు. మిగతా పనులకు కూడా టెండర్లు దాఖలు కానున్నాయని  అంటున్నారు. వచ్చే నెల చివరి వరకు వర్షాలు పూర్తయ్యాక మరికొన్ని రోడ్లకు అధికారులు టెండర్లు పిలవనున్నారు. అక్టోబర్ నుంచి పనులు స్టార్ట్ చేసి వచ్చే ఏడాది మే చివరి నాటికి పనులు పూర్తి చేసేలా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం గడువు విధించనుంది. 

రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మొత్తం  629.22 కిమీ రోడ్లు దెబ్బతిన్నట్టు అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇందులో ఎక్కువగా  సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, కొత్తగూడెం, గద్వాల, సిద్దిపేట  డివిజన్లలో ఎక్కువగా రోడ్లు దెబ్బతిన్నాయని అధికారులు గుర్తించారు.