రాష్ట్రానికి మరో 3వేల కోట్ల అప్పుకు ఆర్బీఐ అంగీకారం

రాష్ట్రానికి మరో 3వేల కోట్ల అప్పుకు ఆర్బీఐ అంగీకారం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వానికి మరో రూ. 3 వేల కోట్ల అప్పు ఇచ్చేందుకు ఆర్బీఐ అంగీకరించింది. ఈ నెల 28వ తేదీ మంగళవారం ఆర్బీఐ నిర్వహించే సెక్యూరిటీ వేలంలో పాల్గొని ఈ మొత్తాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ తెచ్చుకోనుంది. వరుసగా 12, 13, 14 సంవత్సరాల టెన్యుర్​తో ఈ అప్పును తెలంగాణ తీసుకోనున్నదని శుక్రవారం ఆర్బీఐ ప్రకటించింది. అయితే.. ఈ నెల 7న రూ.4 వేల కోట్ల అప్పును ఆర్బీఐ నుంచి రాష్ట్ర సర్కార్​  తీసుకున్నది. మరోసారి తీసుకోనున్న రూ. 3 వేల కోట్ల అప్పుతో ఒక్క నెలలో రూ.7 వేల కోట్లు అవుతుంది. ఏప్రిల్​ నుంచి జూన్ వరకు ఈ మూడు నెలల కాలంలో రూ.15 వేల కోట్లు అప్పు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించగా, ఇష్టారీతి అప్పులపై అన్ని రాష్ట్రాలపై సీరియస్​ అయిన కేంద్రం.. గ్యారంటీ అప్పులపై పూర్తి వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రం నివేదిక పంపగా.. అది తప్పులతడకగా ఉందంటూ కేంద్రం వెనక్కి పంపింది. ఈ నెల 7న ఇచ్చిన నాలుగు వేల కోట్ల అప్పు తాత్కాలికంగా మంజూరు చేసినవేనని ఆర్బీఐ అప్పట్లోనే పేర్కొంది. అయితే 28వ తేదీన తీసుకునే అప్పు వన్​టైం కోసమా.. లేదా రెగ్యులర్ బేసిస్​లో ఇచ్చారా.. అనేది తమకు కూడా స్పష్టత లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.

రైతుబంధుకు ఊరట

ఈ నెల 28 నుంచి రైతుబంధు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి 15వ తేదీ నుంచే రైతుబంధు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే నిధుల కొరతతో ఆలస్యమైంది. ఆర్బీఐ నుంచి అప్పు పుడుతుండటంతో ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకుంది. రూ. 3 వేల కోట్లను పూర్తిగా రైతుబంధుకే మళ్లించనున్నట్లు ఫైనాన్స్​ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ స్కీంకు ఎకరాకు రూ. 5 వేల చొప్పున మొత్తం రైతులకు రూ.7,400 కోట్లు చెల్లించాల్సి ఉన్నది.