
కోవిడ్-19 సెకండ్ వేవ్ ప్రభావంతో కుదేలైన పలు రంగాలకు ఆర్బీఐ రూ. 15 వేల కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన మానెటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లో నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ సాయం అందించనుంది. ఈ సాయానికి నాలుగు శాతం రెపో రేటుతో మూడేళ్ల కాలపరిమితి ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు.
ఈ పథకంలో భాగంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, అడ్వెంచర్, హెరిటేజ్ ఫెసిలిటీలు, ఏవియేషన్ సర్వీసుల గ్రౌండ్ హ్యాండ్లింగ్, సప్లై చైన్, ప్రైవేటు బస్ ఆపరేటర్లు, కార్ రిపేరు సర్వీసులు, ఈవెంట్ ఆర్గనైజర్లు, స్పా క్లినిక్‌లు, బ్యూటీ పార్లర్ల వంటి రంగాలకు బ్యాంకులు కొత్త రుణ సదుపాయం కల్పిస్తాయి. అదనంగా ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు సిడ్బీకి రూ. 16 వేల కోట్ల ప్రత్యేక లిక్విడిటీ ఫెసిలిటీని అందించాలని ఆర్బీఐ నిర్ణయించింది.