న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో జీడీపీ 7.1 శాతం వృద్ధి చెందుతుందని ఆర్‌బీఐ అంచనా వేయగా, 6.7 శాతం మాత్రమే పెరిగింది. దీనిపై ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. అనుకున్నదాని కంటే తక్కువ గ్రోత్ రేట్ నమోదైనా, అన్ని సెక్టార్లు స్ట్రాంగ్‌గా ఉన్నాయని, మెజార్టీ సెక్టార్లలో వృద్ధి రేట్ 7 శాతాన్ని దాటిందని పేర్కొన్నారు. జీడీపీ పెరగడంలో కీలకమైన వినియోగం, ఇన్వెస్ట్‌మెంట్, మాన్యుఫాక్చరింగ్, సర్వీసెస్, కన్‌స్ట్రక్షన్ సెక్టార్లలో ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో 7 శాతం గ్రోత్ నమోదైందని అన్నారు.
కానీ, రియల్ జీడీపీ గ్రోత్ రేట్ తగ్గడానికి ప్రధాన కారణం ప్రభుత్వ ఖర్చులు తగ్గడం, వ్యవసాయ రంగంలో వృద్ధి నెమ్మదించడమేనని వివరించారు. ఎన్నికల వలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చులు జూన్ క్వార్టర్‌లో పడిపోయాయని, ఇదే టైమ్‌లో వ్యవసాయ రంగం కేవలం 2 శాతమే పెరిగిందని దాస్ వివరించారు. ‘రానున్న క్వార్టర్లలో ప్రభుత్వ ఖర్చులు ఊపందుకుంటాయి. గ్రోత్‌కు సపోర్ట్ లభిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ గ్రోత్ రేట్ 7. 2 శాతం ఉంటుందని నమ్ముతున్నాం’ అని దాస్ వివరించారు.