రూ.వెయ్యి నోట్లను తీసుకు రావటం లేదు : ఆర్బీఐ గవర్నర్‌ క్లారిటీ

రూ.వెయ్యి నోట్లను తీసుకు రావటం లేదు : ఆర్బీఐ గవర్నర్‌ క్లారిటీ

2000 నోట్లు కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న వేళ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. 2 వేల నోట్లను వెన‌క్కి తీసుకుంటున్నట్లు ప్రక‌టించిన త‌ర్వాత‌.. ఆర్బీఐ గ‌వ‌ర్నర్ తొలిసారి మీడియాతో మాట్లాడారు. పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 2వేల నోట్లను ఉప‌సంహ‌రించుకున్న నేప‌థ్యంలో ఆ ఒత్తిడిని త‌ట్టుకునేందుకు రూ.1000 నోట్లను ప్రవేశ‌పెడుతారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. రూ.1000 నోటును తయారు చేసి, విడుదల చేసే ఉద్దేశం, ఆలోచన తమకు లేదన్నారు. అదంతా ఊహాజ‌నితమేనని, అలాంటి ప్రతిపాద‌నే లేద‌ని స్పష్టం చేశారు. వీటితో పాటు రూ.2 వేల నోట్ల ఉపసంహరణకు సంబంధించి పలు విషయాలను వెల్లడించారు.

నోట్ల ఉపసంహరణ అనేది ఆర్బీఐ సాధారణంగా చేపట్టే కరెన్సీ మేనేజ్‌మెంట్‌ చర్యల్లో భాగమేనని, క్లీన్‌ నోట్‌ పాలసీ అనే ప్రక్రియ ఆర్బీఐ ఎప్పటి నుంచే అమలుచేస్తోందని శక్తికాంత్ దాస్ వివరించారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న క‌రెన్సీలో 2 వేల నోట్ల విలువ కేవ‌లం 10.8 శాతం మాత్రమే అని, ప్రస్తుత ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వ‌ల్ల దేశ ఆర్థిక వ్యవ‌స్థపై చాలా స్వల్ప స్థాయిలో ప్రభావం ఉంటుంద‌న్నారు. రూ. 2,000 నోటు నవంబర్ 2016లో ప్రవేశపెట్టిన ఆర్బీఐ.. ప్రధానంగా పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్థిక వ్యవస్థలో కరెన్సీ అవసరాన్ని త్వరిత పద్ధతిలో తీర్చేందుకు రూ.2000 నోటు చలామణిలోకి తీసుకొచ్చింది.