బెంచ్‌‌మార్క్ వడ్డీరేట్లను మార్చలేదు

బెంచ్‌‌మార్క్ వడ్డీరేట్లను మార్చలేదు


రెపోరేటు ఎప్పట్లాగే 4 %
రివర్స్ రిపో రేటు@3.5 %
జీడీపీ గ్రోత్ రేటు అంచనా 9.5 %

న్యూఢిల్లీ:ఎనలిస్టులు ఊహించినట్టుగానే ఆర్‌‌బీఐ కీలక బెంచ్‌‌మార్క్ వడ్డీరేట్లను మార్చలేదు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఫైనాన్షియల్ గ్రోత్ రేటుకు ఊతమివ్వడానికి, ధరల పెరుగుదలను అదుపులో ఉంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. రెపో రేట్లను.. అంటే బ్యాంకులకు ఇచ్చే డబ్బుపై ఆర్‌‌బీఐ వసూలు చేసే కీలక వడ్డీ రేటును- నాలుగు శాతమే కొనసాగిస్తారు. రివర్స్ రెపో రేటు - .. అంటే ఆర్‌‌బీఐ బ్యాంకుల నుండి  తీసుకునే  మొత్తానికి చెల్లించే వడ్డీ రేటు కూడా 3.35 శాతం యదాతథంగా ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్‌‌లో జరిగిన ఎంపీసీ సమావేశంలోనూ వడ్డీరేట్లను మార్చలేదు. ఆర్‌‌బీఐ తన పాలసీ రేట్లను చివరిసారిగా 2020 మే 22 న తగ్గించింది. మూడు రోజుల పాటు జరిగిన  ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం ముగింపు సందర్భంగా ఆర్‌‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వాస్తవిక జీడీపీ పెరుగుదలను 9.5 శాతంగా అంచనా వేశామన్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కారణంగా మునుపటి అంచనా 10.5 శాతంతో పోలిస్తే ఇది కొద్దిగా తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లోనూ గ్రోత్‌‌ రేటు అంచనాలను 26.2శాతం నుంచి 18.5శాతానికి కుదించింది. 
తప్పకుండా పుంజుకుంటాం..
 ఈ సారి వర్షాలు బాగుండే అవకాశాలు ఉండటం, గ్లోబల్ ఎకానమీ పుంజుకుంటుండటం, కరోనా కేసులు తగ్గడం వల్ల ఇండియా ఎకానమీ త్వరగా కోలుకుంటుందని దాస్ ధీమా వ్యక్తం చేశారు. 
 రాష్ట్రాలు ఆంక్షలను తొలగించడం, వ్యాక్సిన్ డ్రైవ్ వేగవంతం అవుతున్నందున వచ్చే నెల నుంచి ఆర్థిక పునరుద్ధరణ మొదలవుతుందని ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్ కామెంట్ చేశారు.  
 కరోనావైరస్  అనంతర షాక్ నుండి ఆర్థిక వ్యవస్థను పరిరక్షించడానికి రిజర్వ్ బ్యాంక్ రెపో రేట్లను గత మార్చి  నుండి 115 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 
 ప్రభుత్వ లెక్కల ప్రకారం, కూరగాయలు, పప్పుల వంటి వాటి ధరలు తగ్గడం వలన రిటైల్ ఇన్‌‌ఫ్లేషన్‌‌ కూడా మూడు నెలల కనిష్ట 4.29 శాతానికి చేరింది.
 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి సగభాగంలో రిటైల్ ఇన్‌‌ఫ్లేషన్‌‌ ను 5.2 శాతంగా ఆర్‌‌బీఐ అంచనా వేసింది. రెండో క్వార్టర్లో ఇది 5.4 శాతం ఉండొచ్చని తెలిపింది.
 2022 మార్చి 30 వరకు సెంట్రల్ బ్యాంక్.. లిక్విడిటీ కోసం రూ.15 వేల కోట్ల ప్రత్యేక లిక్విడిటీ విండోను తెరుస్తుందని ఆర్‌‌బీఐ గవర్నర్ ప్రకటించారు. దీని ద్వారా చిన్న ఇండస్ట్రీలకు సాయం చేస్తారు
 జీ–శాప్ 2.0 కింద ఈ నెల 17న రూ.40 వేల కోట్ల విలువైన సెక్యూరిటీలను ఆర్‌‌బీఐ కొనుగోలు చేసింది. ఈ వారం మొదట్లో విడుదల చేసిన జీడీపీ అంచనాల ప్రకారం, 2020–-21 ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ 7.3 శాతం తగ్గింది. వ్యవసాయ రంగం 3.6 శాతం గ్రోత్ సాధించింది.  సేవలు, పారిశ్రామిక రంగాలు వరుసగా 8.4 శాతం, ఏడు శాతం తగ్గాయి.