ముంబై: ఆర్‌బీఐ తన రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ఇది 5.25 శాతం నుంచి 5.50 శాతానికి చేరింది. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నాయకత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ రేట్ల పెంపునకు బుధవారం ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు, రూపాయి విలువ తగ్గుదల కారణంగా ఇక ముందు కూడా రేట్ల పెంపు కొనసాగవచ్చనే సంకేతాలు ఇచ్చింది.
ఆర్‌బీఐ నిర్ణయంతో..హోమ్, వెహికల్ లోన్ తీసుకున్న వారి నెలవారీ ఈఎంఐ మొత్తం పెరగనుంది. గతంలో 5.25 శాతంగా ఉన్న రెపో రేటును పెంచడం ద్వారా ఆర్‌బీఐ తక్కువ వడ్డీ ప్రయోజనాలకు గుడ్‌బై చెప్పింది. గత ఏడాది రెపోరేటును 1.25 శాతం మేర రేట్లు కుదించడంతో కిస్తీల భారం తగ్గింది. తాజా నిర్ణయం ఫలితంగా రూ.25 లక్షల నుంచి రూ.2 కోట్లు వరకు 20 ఏళ్ల కాలపరిమితితో హోమ్ లోన్లు తీసుకున్న వాళ్లు బ్యాంకులకు అదనంగా చెల్లించాలి. ఉదాహరణకు..20 ఏళ్లకు ఏటా 8 శాతం వడ్డీతో రూ.50 లక్షలు తీసుకున్న వాళ్ల నెలవారీ ఈఎంఐ రూ.41,822 నుంచి రూ. 42,603 వరకు పెరుగుతుంది. మొత్తం కాలపరిమితిలో (240 నెలలు) అదనపు వడ్డీ భారం సుమారు రూ. 1,87,440 అవుతుంది.
నాలుగేళ్ల తర్వాత తొలిసారి ..
దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచింది. మల్హోత్రా గత డిసెంబరులో ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఇదే మొదటి పెంపు. విధానపరమైన వైఖరిని కఠిన వైఖరి వైపు మళ్లించడం ద్వారా సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్ల తగ్గింపు సాధ్యం కాదని మల్హోత్రా స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో పరిస్థితులను బట్టి రేట్లను పెంచడం లేదా యథాతథంగా ఉంచడం తప్ప తగ్గించే ఆలోచన లేదన్నారు. గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సవాళ్ల కారణంగా మున్ముందు అర శాతం వరకు రేట్ల పెంపు ఉండవచ్చని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు
ఈ ఏడాది ఆగస్టులో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 4.82 శాతానికి చేరింది. ఆర్‌బీఐ నిర్దేశిత 4 శాతం లక్ష్యం కంటే వరుసగా 3వ నెలలో కూడా ఇది ఎక్కువే. ప్రధాణ ద్రవ్యోల్బణం 4.2 శాతానికి ఎగిసింది. ముడిచమురు ధర జులైలో 82 డాలర్లు ఉండగా సెప్టెంబర్ నాటికి 116 డాలర్లకు చేరింది. దీనికి తోడు ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గడం, ఉల్లి, చక్కెర ధరల పెరుగుదల ఆహార ద్రవ్యోల్బణాన్ని పెంచాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటు ద్రవ్యోల్బణం 5.2 శాతంగా ఉండవచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది.
ఎకానమీ భేష్
ద్రవ్యోల్బణ సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా నిలబడింది. మొదటి క్వార్టర్లో జీడీపీ వృద్ధి 7.8 శాతంగా నమోదు కావడంతో 2026 –27 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక వృద్ధి అంచనాను ఆర్‌బీఐ 40 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) పెంచి 7.1 శాతానికి సవరించింది. తయారీ, సేవా రంగాలు మంచి పురోగతి సాధించాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ సమృద్ధిగా ఉండటంతో పాటు బ్యాంకు క్రెడిట్ వృద్ధి సెప్టెంబర్ 15 నాటికి 18.1 శాతానికి చేరింది.
ఎండీఆర్ వల్ల నష్టం లేదు..
యూపీఐ లావాదేవీలపై విధించే ఎండీఆర్ డిజిటల్ చెల్లింపుల పరిమాణంపై పెద్దగా ప్రభావం చూపదని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. ఈనెల 15 నుంచి రూ.2,000 కంటే ఎక్కువ విలువైన కొన్ని వ్యాపార లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ వసూలు చేస్తారు. దీనివల్ల సాధారణ వినియోగదారులపై నేరుగా ఎలాంటి అదనపు భారం పడదని ఆయన స్పష్టం చేశారు.
