యూపీఐ ట్రాన్సాక్షన్స్పైనా చార్జీల యోచన

యూపీఐ ట్రాన్సాక్షన్స్పైనా చార్జీల యోచన

ఇది డిజిటల్ యుగం. ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు యూపీఐ లావాదేవీలపై ఆధారపడుతున్నారు. రూ.1 నుంచి మొదలుకొని వేలు, లక్షల మొత్తాలను యూపీఐ పద్ధతిలో ఇచ్చి పుచ్చుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో ఆర్బీఐ ఓ కీలక ప్రతిపాదనను పరిశీలిస్తోంది. యూపీఐ లావాదేవీలపైనా ‘డిజిటల్ పేమెంట్ చార్జీ’ని విధిస్తే ఎలా ఉంటుందనే దానిపై యోచిస్తోంది.  యూపీఐతో పాటు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్ స్ట్రుమెంట్స్ (పీపీఐ), ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ లపైనా ఈ రుసుమును విధించాలని భావిస్తోంది. అయితే ఆయా డిజిటల్ చెల్లింపు సేవలను అందిస్తున్నందుకుగానూ రుసుమును ఎంతమేర వసూలు చేయాలి ? ఎంత మొత్తానికి ఎంతమేర రుసుమును నిర్ణయించాలి ?  రుసుములు వసూలు చేసే ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట వేసేందుకు ఏం చేయాలి?  అనే దానిపై ప్రజల నుంచి సూచనలను ఆహ్వానిస్తూ ఆగస్టు 17న ఆర్బీఐ ఒక చర్చా పత్రాన్ని (డిస్కషన్ పేపర్) విడుదల చేసింది.  డిజిటల్ పేమెంట్ చార్జీలు న్యాయబద్ధంగా, అందరూ ఆమోదించేంత స్థాయిలో  సముచితంగానే ఉంటాయని ఆర్బీఐ చెబుతోంది. వాటి వల్ల డిజిటల్ పేమెంట్ సేవలు అందిస్తున్న ఇంటర్మీడియరీ ప్లాట్ ఫామ్ లకు కొంత ఆదాయం కూడా లభిస్తుందని అంటోంది. ప్రజల నుంచి     అందే సూచనల ఆధారంగానే డిజిటల్ పేమెంట్ చార్జీలకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందిస్తామని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి. 

ఎండీఆర్ అంటే.. 

ఎండీఆర్ అంటే.. మర్చంట్ డిస్కౌంట్ రేటు.  పలు డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ప్రీపెయిడ్ కార్డుల ద్వారా జరిగే లావాదేవీలపై విధించే రుసుమును ఎండీఆర్ అంటారు. ఎండీఆర్ రుసుమును బ్యాంకు, ఆ కార్డును జారీ చేసిన కంపెనీ కలిసి పంచుకుంటాయి. ఉదాహరణకు ఏదైనా కార్డుపై ఎండీఆర్ 0.5 శాతం ఉంటే .. ఆ మొత్తాన్ని బ్యాంకు, కార్డును జారీచేసిన సంస్థ (వీసా, మాస్టర్ కార్డ్, అమెక్స్ మొదలైనవి) నిర్దిష్ట నిష్పత్తిలో తీసుకుంటాయి. 

అందరు మర్చంట్స్ కు ఎండీఆర్ వర్తింపుపై.. 

ఆర్బీఐకి చెందిన ‘జీరో ఎండీఆర్ పాలసీ’ ప్రకారం ప్రస్తుతానికి డెబిట్ కార్డులు, రూపే కార్డులు, యూపీఐ ద్వారా నిర్వహించే డిజిటల్ లావాదేవీలపై ఎలాంటి రుసుములు విధించడం లేదు. ఈ పద్ధతుల్లో చెల్లింపులను స్వీకరించే క్రమంలో వ్యాపారుల (మర్చంట్స్) పై ఎలాంటి రుసుమును మోపరాదని ఎండీఆర్ పాలసీ నిర్దేశిస్తోంది. అయితే వీసా, మాస్టర్ కార్డ్ కంపెనీలకు చెందిన డెబిట్ కార్డులతో  నిర్వహించే లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు దాదాపు 0.4 శాతం నుంచి 0.9 శాతం దాకా పడుతోంది. ఈ రుసుము మొత్తాన్ని వీసా, మాస్టర్ కార్డ్ లను జారీ చేసే బ్యాంకు, కొనుగోలుదారుడి మధ్య నిర్దిష్ట నిష్పత్తిలో పంచుతున్నారు. తాజాగా ఆర్బీఐ విడుదల చేసిన డిస్కషన్ పేపర్ లో.. సాధారణ లావాదేవీల్లాగే డెబిట్ కార్డుల ట్రాన్సాక్షన్స్ ను కూడా పరిగణించాలా ? ప్రస్తుతం క్రెడిట్ కార్డులపై విధిస్తున్న ఎండీఆర్ చార్జీలు ఆమోదయోగ్య స్థాయిలో ఉన్నాయా ? క్రెడిట్ కార్డులు, పీపీఐ లావాదేవీలపై విధించే ఎండీఆర్ ను క్రమబద్ధీకరించడంపై నియంత్రణ సంస్థలు దృష్టిసారించాల్సిన అవసరం ఉందా ? అందరు మర్చంట్స్ కు ఎండీఆర్ ను సార్వత్రికంగా వర్తింప చేయాలా ? అనే కోణంలో  ప్రజల నుంచి సూచనలను ఆర్బీఐ ఆహ్వానించింది.