బ్యాంకుల్లో మూలుగుతున్న క్లెయిమ్ చేయని రూ.67వేల కోట్లు.. RBI కీలక నిర్ణయం..

బ్యాంకుల్లో మూలుగుతున్న క్లెయిమ్ చేయని రూ.67వేల కోట్లు.. RBI కీలక నిర్ణయం..

ఇప్పుడంటే ఆథార్ కార్డులు, పాన్ కార్డ్ లింకింగ్ అంటూ కస్టమర్ వివరాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసేందుకు కేవైసీ ప్రక్రియ బ్యాంకుల్లో ఉంది. కానీ చాలా సంవత్సరాలుగా ఎవ్వరూ క్లెయిమ్ చేయని వేల కోట్ల రూపాయలు భారతీయ బ్యాంకుల్లో మూలుకుతున్నాయి. అయితే తాతల కాలం నుంచి బ్యాంకుల వద్ద రన్నింగ్ లేని సేవింగ్స్ అకౌంట్లు, కరెంట్ అకౌంట్లతో పాటు మెచ్చూర్ అయినా తిరిగి పొందని డిపాజిట్ల వరకు వేల కోట్లు బ్యాంకుల వద్దే మిగిలిపోయాయి. వీటిని వారి చట్టపరమైన వారసులకు తిరిగి అందించటానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. 

తాజాగా దీనిపై రిజర్వు బ్యాంక్ స్పందిస్తూ బ్యాంకులు చట్టపరమైన వారసులకు క్లెయిమ్ చేయని డబ్బును తిరిగి ఇవ్వటానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలంటూ ఆదేశించింది. రానున్న మూడు నెలల్లో ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని రూ.67వేల కోట్ల డబ్బును తిరిగి అసలైన యజమానులకు అందించాలని కోరింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగంలో లేని ఖాతాల యజమానులను గుర్తించి వారి ఖాతాల పరిష్కరించడానికి అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఒక ప్రత్యేక ఔట్రీచ్ చొరవను ప్లాన్ చేశారు.

వాస్తవానికి సేవింగ్ లేదా కరెంట్ అకౌంట్లలో పదేళ్లపాటు క్లెయిమ్ చేయని డబ్బు లేదా మెచ్చూర్ అయిన తర్వాత కూడా పదేళ్ల పాటు క్లెయిమ్ చేయని టర్మ్ డిపాజిట్లను బ్యాంకులు అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్‌లుగా వర్గీకరిస్తాయి. తరువాత బ్యాంకులు రిజర్వు బ్యాంకు నిర్వహించే DEA నిధికి ఈ మెుత్తాలను బదిలీ చేస్తాయి. ఇందులోని డబ్బును అసలు యజమాని లేదా వారి చట్టపరమైన వారసులకు చేర్చేందుకు UDGAM పోర్టల్ తీసుకొచ్చింది రిజర్వు బ్యాంక్. ఇందులో దేశంలోని అన్ని బ్యాంకులలో ప్రజలు తమ అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను కనుగొనవచ్చు. ఈ పోర్టల్ లో ప్రస్తుతం 30 బ్యాంకులు తమ వద్ద ఉన్న క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలను అందిస్తున్నాయి.