
- నేడే ఆర్బీఐ పాలసీ ప్రకటన
ముంబై: కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ నాయకత్వంలో తొలిసారిగా సమావేశమైన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీ సీ) వడ్డీ రేట్లను పాతవే కొనసాగిస్తుందా లేక తగ్గిం పుతో మార్కెట్లను ఆశ్చర్యపరుస్తుందా అనేది నేడు తేలనుంది. పాత గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను సాగనంపిన ప్రభుత్వానికి వడ్డీ రేట్లు తగ్గాలనే కోరిక ఉంది. ద్రవ్యోల్బణం గత అయిదు నెలలుగా టార్గెట్ కంటే తక్కువగానే ఉంటున్న నేపథ్యంలో రెపో రేటు తగ్గించొచ్చనే అభిప్రాయం కొంత మంది నిపుణులలో వ్యక్తమవుతోంది. కాకపోతే కోర్ ద్రవ్యోల్బణం 5 శాతాన్ని అంటిపెట్టుకుండటంతో ఈ సారి రెపో రేటును తగ్గించకపోవచ్చనేది మరికొంతమంది ఆర్థిక నిపుణుల భావన.
ద్రవ్యోల్బణం తగ్గినా, ముడి చమురు ధరల పెరుగుదల, ద్రవ్యపరమైన సవాళ్ల ఒత్తిడి కారణంగా
వడ్డీ రేట్లను ఇప్పుడున్న చోటే కొనసాగించొచ్చనేదే ఎక్కువ మంది అభిప్రాయం.కనీస ఆదాయ మద్దతు వంటి కొత్త స్కీములను తాజా బడ్జెట్‌లో ప్రతిపాదించడంతో, భవిష్యత్ లో మళ్లీ ద్రవ్యోల్బణం పెరుగుతుందని రేటింగ్ ఏజన్సీ కేర్ అభిప్రాయపడుతోంది. కాబట్టి వడ్డీ రేట్లలో మార్పులు ఉండకపోవచ్చని సమాచారం.
గవర్నర్‌తోపాటు ఆరుగురు సభ్యుల మానిటరీ కమిటీ సమావేశం మంగళవారం నాడే మొదలైంది.
గతంలోలా కాకుండా గురువారం (నేడు) ఉదయం 11.45 కే విధానపరమైన ప్రకటన చేయాలని
ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించింది. ఇంటరిమ్ డివిడెండ్ మీటింగ్ 18న మరోవైపు ఆర్‌బీఐ నుంచి మధ్యంతర డివిడెండ్ కోసం కేంద్ర ప్రభుత్వం ఉవ్విళ్లూరుతోంది. ఈ మధ్యంతర డివిడెండ్ ప్రతిపాదనను పోస్ట్ బడ్జెట్ ఆర్‌బీఐ బోర్డు మీటింగ్ ( ఈనెల 9న)లో పరిశీలిస్తారని అనుకున్నారు. కానీ, మీటింగ్ ను ఈ నెల 18కి వాయిదా వేసినట్లు అధికార వర్గాల సమాచారం.
బడ్జెట్ తర్వాత జరిగే ఈ సమావేశంలో సాధారణంగా ఆర్థిక మంత్రి పాల్గొని, ప్రసంగిస్తారు. అయితే, ఇంటరిమ్ డివిడెండ్ చెల్లింపు ప్రతిపాదనను మీటింగ్ లక్ష బోర్డు పరిశీలించనుందని ఆర్‌బీఐ వర్గాలు తెలిపాయి. తొలి ఆరు నెలల ఆర్థిక ఫలితాల ఆధారంగా ఇంటరిమ్ డివిడెండ్ మీద బోర్డు ఒక
నిర్ణయం తీసుకుంటుదని వెల్లడించాయి. మునుపెన్నడూ లేని విధంగా ఆర్‌బీఐ ఖాతాలను మొదటిసారిగా ఆరు నెలలకే ఆడిట్ నిర్వహిస్తున్నారు. ఇంటరిమ్ డివిడెండ్ చెల్లింపు కోసమే ఇలా ఆడిట్ నిర్వహిస్తున్నట్లు కూడా ఆ వర్గాలు చెబుతున్నాయి.