రఘురామ్ రాజన్ 2013 ఫార్ములా రిపీట్ చేస్తున్న RBI.. రూపాయి నిలదొక్కుకుంటుందా?

రఘురామ్ రాజన్ 2013 ఫార్ములా రిపీట్ చేస్తున్న RBI.. రూపాయి నిలదొక్కుకుంటుందా?

ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్‌లో ముడిచమురు ధరల పెరుగుదల, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో వడ్డీ రేట్లను పెంచి దేశీయ వృద్ధిని దెబ్బతీయడం కంటే.. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే ఉత్తమ మార్గమని రిజర్వ్ బ్యాంక్ భావించింది. జూన్ 2026 పాలసీ మీటింగ్‌లో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తీసుకున్న నిర్ణయాలు.. గతంలో 2013 నాటి ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అనుసరించిన సక్సెస్ ఫుల్ వ్యూహాన్ని గుర్తుచేస్తున్నాయి. వడ్డీ రేట్లు పెంచకుండానే దేశంలోకి డాలర్ల వరద పారించడం ద్వారా ఆర్థిక వృద్ధికి ఊతమివ్వడమే ఈ సరికొత్త ప్లాన్.

అసలేంటి ఈ ఎఫ్‌సీఎన్‌ఆర్(బి) మ్యాజిక్?
ఈ వ్యూహంలో అత్యంత కీలకమైనది ఎఫ్‌సీఎన్‌ఆర్(బి) [ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ (బ్యాంక్)] డిపాజిట్లపై రాయితీలను మళ్లీ తీసుకురావడం. ఇది ఎన్‌ఆర్‌ఐలు భారతీయ బ్యాంకుల్లో డాలర్లు, యూరోలు, పౌండ్ల రూపంలో దాచుకునే ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్. దీనివల్ల ఎన్‌ఆర్‌ఐలకు రూపాయి విలువ తగ్గిపోతుందనే భయం ఉండదు, పైగా వడ్డీపై భారత్‌లో ఎలాంటి పన్ను ఉండదు. సాధారణంగా ఈ విదేశీ కరెన్సీని బ్యాంకులు రూపాయిల్లోకి మార్చి లోన్లు ఇస్తాయి. కానీ ఎక్స్ఛేంజ్ రేట్ రిస్క్ మారినప్పుడు నష్టపోకుండా ఉండేందుకు చేసే 'హెడ్జింగ్' బ్యాంకులకు భారీ ఖర్చుతో కూడుకున్నది.

ఇక్కడే ఆర్‌బీఐ రంగంలోకి దిగింది. సెప్టెంబర్ 30, 2026 వరకు వచ్చే కొత్త 3-5 ఏళ్ల ఎఫ్‌సీఎన్‌ఆర్(బి) డిపాజిట్లపై అయ్యే పూర్తి హెడ్జింగ్ ఖర్చును ఆర్‌బీఐ భరిస్తుందని ప్రకటించింది. దీనివల్ల బ్యాంకులు ఎన్‌ఆర్‌ఐలకు అమెరికా బాండ్ల కంటే ఎక్కువగా 5.5% నుంచి 6% వరకు బంపర్ వడ్డీ రేట్లను ఆఫర్ చేయగలవు. 2013లో రఘురామ్ రాజన్ ఇలాంటి స్కీమ్ తీసుకురావటం ద్వారానే ఏకంగా 26 బిలియన్ డాలర్లను దేశంలోకి తీసుకువచ్చారు. ఈసారి ఏకంగా 35 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.3లక్షల కోట్లకు పైగా డిపాజిట్లు వస్తాయని అంచనా.

ALSO READ : EPFO బిగ్ అప్‌డేట్

బాండ్ మార్కెట్‌కు బూస్ట్..
రెండో కీలక అడుగు విదేశీ రుణాల (- ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్) సరళీకరణ. భారత ప్రభుత్వ రంగ సంస్థలు అంతర్జాతీయ మార్కెట్ నుంచి తక్కువ వడ్డీకి డాలర్ రుణాలు తీసుకునేందుకు సెప్టెంబర్ 2026 వరకు ఆర్‌బీఐ రాయితీలతో కూడిన ఫారెక్స్ స్వాప్ సౌకర్యాన్ని కల్పించింది. దీనితో పాటు విదేశీ పెట్టుబడిదారులు భారత ప్రభుత్వ బాండ్లలో సులభంగా పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా నిబంధనలను సడలించింది. దీనికి మద్దతుగా కేంద్ర ప్రభుత్వం కూడా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు గవర్నమెంట్ సెక్యూరిటీలపై క్యాపిటల్ గెయిన్స్, విత్‌హోల్డింగ్ ట్యాక్స్‌లను పూర్తిగా రద్దు చేసింది. దీనివల్ల బ్లూమ్‌బర్గ్ గ్లోబల్ బాండ్ ఇండెక్స్‌లో భారత్‌కు చోటు దక్కే అవకాశం పెరిగింది.

రూపాయి కోసం కాదు..
ఈ భారీ చర్యల ద్వారా 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లోకి దాదాపు 55 నుంచి 65 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుత ద్రవ్యోల్బణం దేశీయ డిమాండ్ వల్ల వచ్చింది కాదు.. కేవలం ముడిచమురు సరఫరా లోపాల వల్లే ఏర్పడింది. కాబట్టి వడ్డీ రేట్లు పెంచితే పెట్టుబడులు ఆగిపోతాయి. అందుకే ఆర్‌బీఐ విదేశీ డాలర్లను ఆకర్షించి విదేశీ మారక నిల్వలను పెంచుకుంటూ, రూపాయిని స్థిరపరుస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే ఆర్‌బీఐ కేవలం రూపాయి కోసమే కాకుండా.. దేశ ఆర్థిక వృద్ధికి ఎలాంటి డోకా లేకుండా చేస్తూ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది.