హమ్మయ్య సాయిరాం : రూ. 2 వేల నోట్లు.. 76 శాతం వచ్చేశాయ్

హమ్మయ్య సాయిరాం : రూ. 2 వేల నోట్లు.. 76 శాతం వచ్చేశాయ్

 రూ. 2 వేల నోట్ల ఉపసంహరణపై  రిజర్వ్ బ్యాంక్  కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు 76 శాతం రూ. 2 వేల నోట్లు తిరిగివచ్చినట్లు స్పష్టం చేసింది.  ఇందులో అత్యధిక శాతం డిపాజిట్ల రూపంలో వచ్చాయని పేర్కొంది.  దాదాపు 87 శాతం డిపాజిట్ల రూపంలోనే వచ్చాయని..మిగతా 13 శాతం నోట్లను ప్రజలు మార్చుకున్నట్లు వెల్లడించింది. 

మే 19 నుంచి జూన్‌ 30 వరకు రూ.2.72లక్షల కోట్ల విలువైన రూ.2వేల నోట్లు  బ్యాంకులకు చేరుకున్నాయని ఆర్బీఐ ప్రకటించింది.  మొత్తం చలామణీలో ఉన్న నోట్లలో ఇవి76శాతం అని స్పష్టం చేసింది. ప్రస్తుతం  రూ. 84 వేల కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు మాత్రమే చలామణీలో ఉన్నాయని లో వెల్లడించింది. 

చలామణిలో ఉన్న రూ.2వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  మే 19న ప్రకటించింది. వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రజల వద్ద ఉన్న రూ. 2 వేల  నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబరు 30 వరకు గడువు విధించింది. 

రూ. 2 వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించడంతో ప్రజలు మరోసారి  గందరగోళానికి గురయ్యారు. నోట్లను మార్చుకునేందుకు  బ్యాంకులకు పరుగులు పెట్టారు. అయితే బయట కూడా చాలా వరకు షాపుల్లో, ఇతర స్టోర్లలో, షాపింగ్ మాల్స్‌ల్లో రూ.2 వేల నోట్లను తీసుకోబోమని రాసిపెట్టడంతో మరింత ఆయోమయానికి గురయ్యారు. అయితే కొద్ది రోజుల తర్వాత పరిస్థితిని అర్థం చేసుకున్న జనం..బ్యాంకుల్లో సులభంగా రూ. 2 వేల నోట్లను మార్చుకున్నారు. 

ALSO READ:ఈ కార్ల ధరలు పెరుగుతున్నాయి.. ఇప్పుడే కొనేయండి..

2016లో కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్ల రద్దు చేసింది. ఆ తర్వాత రూ.2వేల నోట్లను తీసుకొచ్చి్ంది.  ఆ తర్వాత క్రమంగా వీటి చెలమణిని తగ్గించింది.  2023 మార్చి 31 నాటికి కేవలం రూ.3.62 లక్షల కోట్ల రూ. 2 వేలనోట్లు మాత్రమే చలామణిలో ఉన్నట్లు ఆర్బీఐ అంచనా వేసింది. ఇందులో 76శాతం నోట్లు తిరిగి బ్యాంకులకు చేరుకున్నాయి.