ఈ కార్ల ధరలు పెరుగుతున్నాయి.. ఇప్పుడే కొనేయండి..

 ఈ కార్ల ధరలు పెరుగుతున్నాయి.. ఇప్పుడే కొనేయండి..

కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అందులో టాటా మోటార్స్ కంపెనీ కార్ల కోసం చూస్తున్నారా? అయితే మీకో షాకింగ్ వార్త. ధరలు భారీగా పెరుగుతున్నాయ్.. మీకు ఇంకా 15 రోజులే ఛాన్స్ ఉంది. ధరలు పెరగక ముందే కొనేయడం మంచిది. టాటా మోటార్స్ కంపెనీ ఏ మోడల్ కార్లపై ఎంత ధర పెంచుతుంది.. ఎప్పటి నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తాయి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

దేశీయ ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ ‘టాటా మోటార్స్’ మరోసారి కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే పలుమార్లు వాహనాల ధరలను పెంచిన టాటా మోటార్స్.. తాజాగా మరోసారి పెంచుతున్నట్లు ప్రకటించింది. విద్యుత్‌ వాహనాలు సహా అన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచుతున్నట్టు సోమవారం  (జులై 3) ప్రకటించింది. అన్ని మోడళ్లపై సగటున 0.6 శాతం చొప్పున పెంపు ఉంటుందని కంపెనీ పేర్కొంది. పెరిగిన ధరలు జులై 17 నుంచి అమల్లోకి వస్తుంది. . అయితే జులై 16 వరకు అన్ని బుకింగ్‌లపై, జులై 31 వరకు డెలివరీలకు పెంపు నిర్ణయం వర్తించదని స్పష్టం చేసింది. ఇన్‌పుట్‌ కాస్ట్‌ పెరగడమే ఈ ధరల పెంపునకు కారణమని టాటా మోటార్స్‌ తెలిపింది.

సాంప్రదాయ ఇంధన వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా ఈ పెంపు ఉంటుంది. మోడల్, వేరియంట్‌ను బట్టి ధరల పెరుగుదల 0.6 శాతం ఉండనుంది. ప్రధానంగా వాహనాల తయారీలో కీలక ముడి పదార్థాల ధరలు, ఇతర ఇన్‌పుట్ ఖర్చులు భారం కావడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నామని టాటా మోటార్స్ వివరించింది.

టాటా మోటార్స్‌కు చెందిన హ్యాచ్‌బ్యాక్‌, సెడాన్, ఎస్‌యూవీ, ఈవీ వాహనాల అన్నింటికీ ఈ పెంపు వర్తించనుంది. టియాగో, టిగోర్‌, ఆల్ట్రోజ్‌, సఫారి, నెక్సాన్‌, పంచ్, హ్యారియర్‌ పేరిట వివిధ మోడళ్లను టాటా మోటార్స్‌ ప్రస్తుతం విక్రయిస్తోంది. నెక్సాన్‌ ఈవీ, టిగోర్‌ ఈవీ పేరిట విద్యుత్‌ కార్లను కూడా టాటా అమ్ముతోంది. ఇప్పుడు ఈ కార్ల ధరలు పెరగనున్నాయి. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో కంపెనీ మొత్తం 2 లక్షల26 వేల 245 వాహనాలను విక్రయించినట్లు ప్రకటించింది. ఇది గత ఏడాది జూన్ త్రైమాసికంలో నమోదైన 2 లక్షల 31 వేల 248 యూనిట్ల కంటే తక్కువ. ఒక్క జూన్ నెల అమ్మకాలను పరిశీలిస్తే దేశీయంగా టాటా మోటార్స్ 47 వేల 235 వాహనాలతో 5 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ALSO READ:హెల్త్ టిప్స్ : ఎంత బరువు ఉంటే.. ఎంత వాటర్ తాగాలి..

టాటా మోటార్స్ కంపెనీ 2023 మే 1న కూడా కార్ల ధరలను 0.6% (వెయిటెడ్ యావరేజ్ పెరుగుదల) పెంచింది. అంతకుముందు జనవరిలో కూడా టాటా కార్ల ధరలు పెరిగాయి. గడిచిన ఆరు నెలలో టాటా మోటార్స్ కార్ల ధరలను పెంచడం ఇది మూడోసారి.  2023లోనే మూడు సార్లు కార్ల ధరలను పెంచడం గమనార్హం. మరోవైపు.. ఈ ఆర్ధిక ఏడాది 2023-24 తొలి త్రైమాసికం ఏప్రిల్- జూన్ ‌లో మొత్తం 2 లక్షల 26 వేల 248 వాహనాలు విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూసుకుంటే 5 శాతం పెరిగింది. 2023, జూన్ నెలలో మొత్తం 47 వేల 235 వాహనాలను విక్రయించింది టాటా మోటార్స్. గత ఏడాది జూన్ లో 45 వేల 197 వాహనాల విక్రయాలు జరిపింది. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో భారీగా పెరుగుదల నమోదైంది. తొలి త్రైమాసికంలో 105 శాతం వృద్ధితో మొత్తం 19 వేల 346 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ ప్రకటించింది. దేశంలో టాటా కంపెనీ కార్లకు మంచి డిమాండ్ ఉంటుంది.