బ్యాంకులకు చేరిన 93% రూ.2వేల నోట్లు.. ఆర్బీఐ కీలక ప్రకటన

బ్యాంకులకు చేరిన 93% రూ.2వేల నోట్లు.. ఆర్బీఐ కీలక ప్రకటన

రూ.2వేల కరెన్సీ నోట్లలో 93 శాతం బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఇప్పుడు కేవలం రూ.0.24 లక్షల కోట్ల నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆగస్టు 31 నాటికి రూ. 24వేల కోట్ల విలువైన నోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తెలిపింది.

"బ్యాంకుల నుండి అందిన డేటా ప్రకారం, ఆగస్టు 31, 2023 వరకు చెలామణిలో ఉన్న రూ. 2వేల నోట్ల మొత్తం విలువ రూ. 3.32 లక్షల కోట్లు. మే 19, 2023 నాటికి చెలామణిలో ఉన్న రూ. 2వేల నోట్లలో 93% డిపాజిట్ అయ్యాయి”అని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాన బ్యాంకుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం, రూ. 2వేల డినామినేషన్‌లో ఉన్న మొత్తం నోట్లలో 87% డిపాజిట్ల రూపంలో, మిగిలినవి ఇతర డినామినేషన్ నోట్లలోకి మార్చబడినట్లు బ్యాంకింగ్ రెగ్యులేటర్ తెలిపారు.

మే 19న రూ. 2వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది. అయితే ఈ నోట్లను ఖాతాల్లో డిపాజిట్ చేయడానికి లేదా వాటిని బ్యాంకుల్లో మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు ప్రజలకు సమయం ఇచ్చింది. పాత రూ. 5వందలు, రూ. 1వెయ్యి నోట్లు 2016లో జరిగిన డిమోనిటైజేషన్ మాదిరిగా కాకుండా, రూ. 2వేల నోట్లను సెప్టెంబర్ 30 వరకు చట్టబద్దంగా చలామణిలో కొనసాగుతాయని చెప్పింది. సెప్టెంబరు 30 తర్వాత రూ.2వేల నోట్ల రద్దుపై ఆర్బీఐ మరేదైనా ప్రకటన చేస్తుందా.. లేదంటే ఇదే చివరి గడువా అన్నది ఇంకా స్పష్టం చేయకపోవడం గమనార్హం.