మోడీ ప్రభుత్వాన్ని వెంటాడుతున్న కరెంట్ అకౌంట్ లోటు.. 6 అస్త్రాలతో రంగంలోకి RBI

మోడీ ప్రభుత్వాన్ని వెంటాడుతున్న కరెంట్ అకౌంట్ లోటు.. 6 అస్త్రాలతో రంగంలోకి RBI

ఇరాన్ యుద్ధ భయాలు, అంతర్జాతీయ మార్కెట్ల ఒత్తిడితో దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోతుండటం, కరెంట్ అకౌంట్ లోటు విపరీతంగా పెరుగుతుండటంతో మోడీ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిలో పడింది. దీనిని అధిగమించడానికి ఒకవైపు ప్రభుత్వం పన్నుల మినహాయింపులు ఇస్తుండగా.. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన మానిటరీ పాలసీలో వడ్డీ రేట్లను 5.25% వద్ద మార్చకపోయినప్పటికీ, విదేశీ నిధులను దేశంలోకి ఆకర్షించేందుకు 6 అంశాల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.

జీడీపీ వృద్ధి అంచనాను 6.6 శాతానికి తగ్గించి, ద్రవ్యోల్బణ అంచనాను 5.1 శాతానికి పెంచిన ఆర్‌బీఐ.. దేశంలోకి విదేశీ పెట్టుబడులు పోటెత్తడమే ఈ సంక్షోభానికి విరుగుడు అని భావించింది. 

కరెంట్ అకౌంట్ లోటును తగ్గించేందుకు ఆర్‌బీఐ 6 చర్యలు:

1. లాంగ్ టర్మ్ ప్రభుత్వ బాండ్ల ఓపెనింగ్: విదేశీ ఇన్వెస్టర్ల కోసం ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్ పరిధిని పెంచింది. ఇకపై కొత్తగా వచ్చే అన్ని రకాల 15 ఏళ్లు, 30 ఏళ్లు, 40 ఏళ్ల దీర్ఘకాలిక ప్రభుత్వ సెక్యూరిటీలను విదేశీయులు నేరుగా కొనుగోలు చేయవచ్చు.

2. ఎఫ్‌పీఐలపై పరిమితుల ఎత్తివేత: జనరల్ రూట్ కింద వచ్చే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై(FPIs) ఉన్న కాన్సంట్రేషన్ లిమిట్స్‌ను ఆర్‌బీఐ తొలగించింది. దీనివల్ల వారు తమకు నచ్చిన భారతీయ డెట్ సెక్యూరిటీలలో ఎంతైనా పెట్టుబడి పెట్టుకునే సదుపాయం, స్వేచ్ఛ లభిస్తుంది.

3. NRIలకు సెబీ రిజిస్ట్రేషన్ లేకుండానే ఈక్విటీలు: నాన్-రెసిడెంట్ ఇండియన్స్(NRIs), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా(OCIs) ఎలాంటి సెబీ రిజిస్ట్రేషన్ అవసరం లేకుండానే లిస్టెడ్ భారతీయ షేర్లలో పెట్టుబడులు పెట్టే పరిమితిని పెంచింది. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకూ ఈ సదుపాయాన్ని వర్తింపజేశారు.

4. పీఎస్‌యూల రుణాల కోసం కన్సెషనల్ స్వాప్ విండో: ప్రభుత్వ రంగ సంస్థలు విదేశాల నుంచి రుణాలు సేకరించేటప్పుడు కరెన్సీ హెచ్చుతగ్గుల వల్ల నష్టపోకుండా ఉండేందుకు ‘కన్సెషనల్ ఫారెక్స్ స్వాప్ విండో’ గడువును 2026 సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది.

5. ఎన్నారై డిపాజిట్లపై బ్యాంకులకు పూర్తి మద్దతు: విదేశీ భారతీయుల నుండి 3 నుండి 5 ఏళ్ల కాలపరిమితితో ఎఫ్‌సీఎన్‌ఆర్(బి) డిపాజిట్లను ఆకర్షించే బ్యాంకులకు పూర్తి హెడ్జింగ్ కాస్ట్ సపోర్ట్‌ను 2026 సెప్టెంబర్ 30 వరకు ఆర్‌బీఐ పొడిగించింది.

ALSO READ : విదేశీ ఇన్వెస్టర్లకు పన్నుల వాత నుంచి రిలీఫ్..

6. ఎగుమతి సొమ్ము గడువు తగ్గింపు: విదేశాలకు వస్తువులను ఎగుమతి చేసే వ్యాపారులు తమ సంపాదనను భారతదేశానికి తీసుకురావాల్సిన గడువును గతంలో ఉన్న 15 నెలల నుండి 9 నెలలకు తగ్గించింది. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం వేగంగా దేశంలోకి వస్తుంది.

మోడీ ప్రభుత్వ వ్యూహం ఫలించేనా?

ఈ చర్యల వెనుక మోడీ ప్రభుత్వ పెద్ద వ్యూహమే ఉంది. కేవలం మానిటరీ పాలసీని మార్చడం వల్ల కాకుండా, దేశీయ ఆర్థిక ఆస్తులను అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు మరింత ఆకర్షణీయంగా మార్చడం ద్వారా డాలర్ల ప్రవాహాన్ని పెంచవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. బ్యాంకుల్లో ఎన్నారై డిపాజిట్లు పెరగడం, బాండ్ మార్కెట్ లోకి విదేశీ నిధులు రావడం, ఎగుమతిదారులు వేగంగా డాలర్లను దేశంలోకి తీసుకురావడం వల్ల మార్కెట్లో లిక్విడిటీ పెరిగి, రూపాయి పతనాన్ని అడ్డుకోవచ్చని మోడీ సర్కార్ ఆశిస్తోంది. చూడాలి ఇవి ఎంత వేగంగా పనిచేసి భారత ఆర్థిక వ్యవస్థకు ఊతంగా నిలుస్తాయో.