
- సింగరేణి యాజమాన్యం, టీజీబీకేఎస్ మధ్య డీల్ ఓకే
- 356 మంది తిరిగి ఉద్యోగాల్లో చేరేందుకు అవకాశం
సింగరేణి డిస్మిస్డ్ కార్మికులకు శుభవార్త. వివిధ కారణాలతో 2000––2018 మధ్య కాలంలో డిస్మిస్ అయిన కార్మికులను తిరిగి ఉద్యోగాల్లోకి చేర్చుకునేందుకు యాజమాన్యం అంగీకరించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సంస్థ యాజమాన్యానికి, గుర్తింపు కార్మిక సంఘం టీజీబీకేఎస్ కు మధ్య ఒప్పందం కుదిరింది. ఫలితంగా దాదాపు356 మంది డిస్మిస్డ్ కార్మికులు తిరిగి ఉద్యోగాలు పొందేందుకు అవకాశం లభించింది. సింగరేణి సంస్థ డైరెక్టర్ చంద్రశేఖర్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ప్రెసిడెంట్ బి.వెంకట్రావు మధ్య జరిపిన చర్చలు ఫలించడంతో డీల్ ఓకే అయింది. ఒప్పందంలోని షరతుల ప్రకారం అర్హులైన డిస్మిస్డ్ కార్మికులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోనున్నారు.
ఒప్పందంలో ఏముంది?
..జనవరి1, 2000 నుంచి డిసెంబరు31, 2018 మధ్య అనారోగ్యంతో గైర్హాజరై డిస్మిసైన వారు తిరిగి ఉద్యోగం పొందొచ్చు.
..కార్మికుడు డిస్మిస్ అయ్యే నాటికి ఐదేళ్ల ముందు ఏదైనా2 ఏళ్లు కనీసం100 మస్టర్లు (హాజరు దినాలు) పూర్తి చేసి ఉండాలి.
..జులై 1, 2018 నాటికి 46 సంవత్సరాల వయసు దాటి ఉండకూడదు.
..గతంలో డిస్మిస్ అయి, ఒక్క అవకాశంగా తిరిగి ఉద్యోగంలో చేరి, ట్రయల్ పీరియడ్ లో కనీసం190 మస్టర్లు కూడా పూర్తి చేయక ఉద్యోగం కోల్పోయిన వారికి మరో చివరి అవకాశం లభిస్తుంది.
..తిరిగి చేరే డిస్మిస్డ్ కార్మికులు ముందుగా అప్లికేషన్ ఇవ్వాలి. ఆ తర్వాత కంపెనీ హాస్పిటళ్లలో వైద్య పరీక్షలలో ఫిట్ నెస్ సాధిస్తేనే ఉద్యోగంలోకి తీసుకుంటారు.