మున్సిపాలిటీలకు మళ్లీ నోటిఫికేషన్

మున్సిపాలిటీలకు మళ్లీ నోటిఫికేషన్

హైకోర్టుకు  తెలిపిన రాష్ట్ర సర్కారు

హైదరాబాద్​, వెలుగు: పదవీ కాలం ముగిసిన పురపాలక సంఘాలకు ఎన్నికల నిర్వహణపై వేసిన పిటిషన్ల విచారణ ఓ కొలిక్కి వచ్చింది. వాటి ఎన్నికలకు జులై 7న ఇచ్చిన ప్రకటనను వెనక్కు తీసుకుని తాజగా నోటిఫికేషన్​ ఇస్తామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. వార్డుల పునర్విభజనపై తాజా నోటిఫికేషన్​ ఇచ్చాక 7 రోజులు, వాటి పరిష్కారానికి 10 రోజుల గడువు ఇచ్చేందుకు సర్కారు సానుకూలంగా ఉందంటూ అదనపు అడ్వొకేట్​ జనరల్​ జె.  రామచంద్రరావు వివరించారు. చట్ట ప్రకారం ఎన్నికల ప్రక్రియ జరగలేదంటూ 79 మున్సిపాలిటీలపై దాఖలైన వేర్వేరు పిటిషన్లపై ఇంతకుముందు హైకోర్టు స్టే ఇచ్చింది. వీటిపై గురువారం మరోసారి విచారణ జరిగింది. వార్డుల పునర్విభజనపై పిటిషనర్ల అభ్యంతరాలను పరిష్కరించామని, వార్డుల్లో ఓటర్ల సంఖ్య సమంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని అదనపు ఏజీ కోర్టుకు తెలిపారు.
దీంతో ఈ ప్రతిపాదనకు అనుకూలంగా ఉన్న పిటిషన్లపై శుక్రవారం ఆదేశాలిస్తామని జస్టిస్​ ఎ. రాజశేఖర్​రెడ్డి చెప్పారు. వ్యతిరేక వ్యాజ్యాలపై సోమవారం నుంచి విచారిస్తామన్నారు. ఎలక్షన్​ కమిషన్​ తరపున వాదించిన సీనియర్​ లాయర్​ జి. విద్యాసాగర్​.. ఎన్నికల ముందస్తు ప్రక్రియ పూర్తయ్యాక అన్ని పురపాలక సంఘాలకు 45 రోజుల్లో ఎన్నికలను పూర్తి
చేస్తామన్నారు.