బిహార్‌‌లో బీజేపీ17, జేడీయూ 16 సీట్లల్లో పోటీ

బిహార్‌‌లో బీజేపీ17, జేడీయూ 16 సీట్లల్లో పోటీ

పాట్నా : బిహార్‌‌లో ఎన్డీఏ కూట‌‌మి మ‌‌ధ్య సీట్ల పంప‌‌కంపై డీల్ కుదిరింది. ఆ రాష్ట్రంలో మొత్తం 40 లోక్ సభ స్థానాలు ఉండగా..బీజేపీ 17 స్థానాల నుంచి పోటీ చేయ‌‌న్నది. నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ 16 స్థానాల్లో బరిలోకి దిగనుంది. ఇక చిరాగ్ పాశ్వాన్‌‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ(ఎల్‌‌జేపీ) 5 స్థానాల్లో, జితన్‌‌రామ్ మాంఝీకి చెందిన హిందుస్తాన్ అవామ్ మోర్చా, ఉపేంద్ర కుష్వాహాకు చెందిన ఆర్‌‌ఎల్‌‌ఎం(రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ) ఒక్కో స్థానంలో పోటీ చేయనున్నాయి.

ఈ విషయాన్ని ఏన్డీఏ కూటమి సోమవారం సాయంత్రం వెల్లడించింది. మూడేండ్ల క్రితం లోక్‌‌ జనశక్తి పార్టీని చీల్చి కేంద్ర కేబినెట్‌‌లో మంత్రి పదవి దక్కించుకున్న పశుపతి పరాస్‌‌ వర్గానికి చెందిన ఎల్జేపీ ఈసారి ఎన్డీఏ కూటమిలో లేదు. పాశ్వాన్‌‌ కమ్యూనిటీలో పట్టు కోల్పోయిన ఆ పార్టీని ఎన్డీఏ దూరం పెట్టింది. బీహార్‌‌లో పాశ్వాన్‌‌ కమ్యూనిటీకి 6% ఓట్లున్నాయి.

ఆ ఓట్లపై చిరాగ్‌‌ పాశ్వాన్‌‌ వర్గం కమాండ్‌‌ సాధించింది. ఎల్జేపీ కంచుకోట అయిన నవడ లోక్‌‌సభ స్థానం నుంచి ఈసారి బీజేపీ పోటీపడనుంది. గయా, కారకట్‌‌కు బదులుగా జేడీయూకు షియోహర్‌‌ లోక్‌‌సభ స్థానం కేటాయించారు. అదేవిధంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ గెలుచుకున్న కిషన్‌‌గంజ్‌‌ స్థానంలో కూడా జేడీయూ బరిలో దిగనుంది.