- మణుగూరు పీకే ఓసీ డీప్ సైడ్, ఛత్తీస్ గఢ్‌లో బ్లాకులు దక్కించుకోవడానికి కసరత్తు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: రాష్ట్రంతో పాటు దేశంలోని 19 కోల్ బ్లాక్‌లను కోల్ మినిస్ట్రీ వేలానికి పెట్టింది. ఈ నెల 19 నుంచి 22 వరకు వేలం నిర్వహించనున్నారు. తెలంగాణలోని మణుగూరు పీకే ఓసీ డీప్ సైడ్ ఓసీ బ్లాక్‌తో పాటు ఛత్తీస్‌గఢ్‌లోని ఓ కోల్ బ్లాక్‌ను దక్కించుకుందుకు సింగరేణి కసరత్తు చేస్తోంది.
పదేండ్లుగా బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డకట్ట వేసింది. దీంతో కొత్త బ్లాక్ రాని పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు ఉన్న బొగ్గు బావులు ఒక్కొక్కటిగా మూత పడుతుండగా, మరోవైపు కొత్త మైన్స్ రాకపోవడంతో సింగరేణిలో మ్యాన్ పవర్ సర్ప్లస్ ఏర్పడింది. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కోల్ మినిస్ట్రీ నిర్వహించే కోల్ బ్లాకుల వేలంలో పాల్గొనేందుకు సింగరేణికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లాస్ట్ టైం నిర్వహించిన వేలంలో మణుగూరు పీకే ఓసీ డీప్ సైడ్ ఎక్స్టెన్షన్ కోల్ బ్లాక్ కోసం మొదటిసారి సింగరేణి వేలంలో పాల్గొంది. ఈ కోల్ బ్లాక్ కోసం రెండోసారి సింగరేణి వేలంలో పాల్గొనేందుకు సిద్దమవుతోంది.
రెండు బ్లాక్‌ల కోసం..
దేశవ్యాప్తంగా 19 కోల్ బ్లాకులను కోల్ మినిస్ట్రీ వేలంలో పెట్టింది. రాష్ట్రంలోని భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరు పీకే ఓసీ డీప్ సైడ్ ఎక్స్టెన్షన్ కోల్ బ్లాక్‌తో పాటు ఛత్తీస్‌గఢ్‌లోని మరో కోల్ బ్లాక్‌ను దక్కించుకునేందుకు సింగరేణి సిద్ధమవుతోంది.
పీకే ఓసీ కోసం గతంలో సింగరేణితో పాటు జెన్కో సంస్థ పోటీ పడ్డాయి. ఈక్రమంలో తాము రెండో గ్రూప్‌లో వేలంలో పాల్గొంటామని కోల్ మినిస్ట్రీకి సింగరేణి విన్నవించింది. దీంతో ఈ నెల 19 నుంచి జరగనున్న కోల్ బ్లాకుల వేలంలో పీకే ఓసీని కోల్ మినిస్ట్రీ పెట్టింది.
ప్రస్తుతం పీకే ఓసీ పక్కనే ఉన్న ఈ బ్లాక్ వస్తే సింగరేణికి వరంగా మారనుంది. ఈ బ్లాక్‌లో 120 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. జీ8, జీ10, జీ13 గ్రేడ్ బొగ్గు నిల్వలుఈ కోల్ బ్లాక్ లో ఉన్నాయి. జీ8, జీ10 గ్రేడ్ బొగ్గు రకానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
ఈ బ్లాక్‌ను ఎలాగైనా దక్కించుకోవాలనే లక్ష్యంతో సింగరేణి యాజమాన్యం కసరత్తు చేస్తోంది. దీంతోపాటు ఛత్తీస్‌గఢ్‌లోని మరో బ్లాక్ ను దక్కించుకునేందుకు సింగరేణి ఫోకస్ పెట్టింది. ఈ బ్లాక్‌లోనూ నాణ్యతతో కూడిన బొగ్గు నిల్వలున్నాయి. స్టిప్పింగ్ రేషియో కూడా తక్కువగా ఉండడంతో ఈ బ్లాక్‌ను దక్కించుకునేందుకు యాజమాన్యం రంగం సిద్ధం చేస్తోంది.
సింగరేణికి ఇస్తేనే మేలు..
రాష్ట్రంలోని భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరు పీకే ఓసీ డీప్ సైడ్ ఎక్స్టెన్షన్ ఓసీని వేలంలో సింగరేణికి కేటాయించేలా కోల్ మినిస్ట్రీ చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. ఈ విషయంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి చొరవ చూపాలంటున్నారు.
గతంలో సత్తుపల్లి, ఇల్లెందు ఏరియాల్లోని కోయగూడెం ఓసీలను వేలంలో ఇతర సంస్థలు దక్కించుకున్నా మూడేండ్లుగా మైనింగ్ ఆపరేషన్స్ చేయడం లేదు. కోయగూడెంతో పాటు సత్తుపల్లి కోల్ బ్లాక్‌లో మైనింగ్ ఆపరేషన్స్ చేయాలంటే సింగరేణి సహకారం తప్పనిసరిగా మారింది.
ప్రస్తుతం ఉన్న బొగ్గు బావులకు ఆనుకునే ఆ రెండు మైన్స్ ఉండడంతో ఇతర సంస్థలు మైనింగ్ ఆపరేషన్స్ చేయడం ఆషామాషీ కాదని అంటున్నారు. ఈ క్రమంలో సత్తుపల్లి ఓసీని దక్కించుకున్న సంస్థ చేతులెత్తేసింది. కోయగూడెం ఓసీని దక్కించుకున్న సంస్థ తాము ఆపరేషన్స్ చేయలేమని, తాము పెట్టిన పెట్టుబడి ఇవ్వాలంటూ కోర్టుకెక్కింది. ప్రస్తుతం వేలంలో పెట్టిన మణుగూరు పీకే ఓసీ డీప్ సైడ్ ఎక్స్టెన్షన్ కోల్ బ్లాక్ కూడా ఇతర సంస్థలు చేసే పరిస్థితి లేదు.
ఈ క్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ బ్లాక్‌ను సింగరేణికి నేరుగా కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సత్తుపల్లి ఓసీతో పాటు కోయగూడెం ఓసీలను వేలంతో సంబంధం లేకుండా సింగరేణికి కేటాయించి, సింగరేణి సంస్థను ఆదుకోవాలని కార్మికులతో పాటు కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు.
