నల్గొండ జిల్లాలో రియల్ ఎస్టేట్ ఉచ్చులో వ్యవసాయం

నల్గొండ జిల్లాలో రియల్ ఎస్టేట్ ఉచ్చులో వ్యవసాయం

వ్యవసాయానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా పుట్టినిళ్లుగా చెబుతుంటారు. కానీ ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో పరిస్థితులు మారుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు దగ్గరగా ఉండడంతో… రియల్ ఎస్టేట్ బిజినెస్ పెరిగిపోయింది. బీడు భూములతో పాటు… పచ్చని పంటలు పండే భూములు కూడా వెంచర్లుగా మారుతున్నాయి. రైతు అవసరాలను క్యాష్ చేసుకుంటున్న రియల్ మాఫియా….తక్కువ ధరకు భూములను కొని.. ఎక్కువకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటోంది.

నల్గొండ జిల్లాలో ఒకప్పుడు ఎకరా రెండు నుంచి మూడు లక్షలు పలికిన భూమి…రియల్ ఎస్టేట్ పుణ్యమా అని 25 లక్షల రూపాయలకు  పెరిగింది. పట్టణాలు, హైదరాబాద్ శివార్లయితే…కోటి వరకు ధర పలుకుతోంది. దీంతో వ్యవసాయంలో గిట్టుబాటు ధర లేని రైతులు…విసిగిపోయి భూములను అమ్ముకుని వచ్చిన డబ్బుతో వ్యాపారం చేసుకుంటున్నారు. మరికొంత మంది తక్కువ మొత్తంలో ఉన్న భూమిని అమ్మి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు ఏర్పాటైన తర్వాత… పట్టణాల నుంచి పల్లెబాట పట్టారు చాలా మంది. అప్పటి వరకు వేలల్లో ఉన్న భూముల రేట్లను లక్షల్లోకి తీసుకుపోయారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి కొత్తగా సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలు ఏర్పడ్డాయి. హైద్రాబాద్ కు నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలు అతి దగ్గరగా ఉంటాయి. జిల్లాల విభజన తర్వాత వందల సంఖ్యలో పరిశ్రమలు వెలిశాయి. భూములకు మరింత ధర పెరిగింది. సూర్యాపేట జిల్లాకు ఏపీ రాజధాని దగ్గరగా ఉండడంతో ఇక్కడ ఎకరం ధర చుక్కలంటుతోంది.

యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ జోరుమీదుంది. యాదాద్రి ఆలయం ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటుండడంతో… భూముల రేట్లు పది రెట్లు పెరిగాయి. ఇప్పుడక్కడ కనుచూపు మేర వెంచర్లు తప్ప… పంట పొలాలు కనిపించడం లేదు. ఆలయం అభివృద్ధి జరగడం ఒక ఎత్తయితే… రాజధానికి దగ్గరగా ఉండటం కూడా ఇన్వెస్ట్ మెంట్ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి యాదాద్రిలో ఫ్లాట్లను కొంటున్నారు. రియల్ వ్యాపారం జోరుతో… రెవెన్యూ ఆదాయం కూడా భారీగా పెరిగింది. ఇదే అదునుగా నిబంధనలను లెక్క చేయకుండా లే అవుట్లు లేకుండానే వెంచర్లు వేస్తున్నారు వ్యాపారులు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో గతంలో వ్యవసాయంపై ఆధారపడ్డ కుటుంబాలు…ఇప్పుడు రియల్ వ్యాపారుల ఉచ్చులో పడి భూములను అమ్ముకుంటున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే.. జిల్లాలో వ్యవసాయం కనుమరుగయ్యే  ప్రమాదం ఏర్పడుతుంది.