ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ పేరుతో రూ.4.87 కోట్లు లూటీ

ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ పేరుతో  రూ.4.87 కోట్లు లూటీ
  • ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో లాభాలు చూపుతూ బురిడీ
  • సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఆశ్రయించిన బాధితుడు శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఆన్‌‌‌‌‌‌‌‌లైన్​ పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాళ్ల దండయాత్ర కొనసాగుతూనే ఉంది. ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ చేస్తే తక్కువ సమయంలో రూ.కోట్లు లాభాలు వస్తాయని నమ్మించి నట్టేట ముంచుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రియల్‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌ వ్యాపారి వద్ద నుంచి కూడా రూ.4.87 కోట్లు కొట్టేశారు. మోసపోయానని గుర్తించిన బాధితుడు నేషనల్‌‌‌‌‌‌‌‌ సైబర్ క్రైమ్‌‌‌‌‌‌‌‌ రిపోర్టింగ్ పోర్టల్‌‌‌‌‌‌‌‌తో పాటు సోమవారం రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు ఫిర్యాదు చేశాడు. రంగారెడ్డి జిల్లా హయత్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం హస్తినాపురానికి చెందిన కుంబం శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ రెడ్డి(55) రియల్ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌ వ్యాపారం చేస్తుంటాడు. జులై 13న ఆయన వాట్సాప్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 8968651687 నంబర్‌‌‌‌‌‌‌‌ నుంచి ఓ మెసేజ్‌‌‌‌‌‌‌‌ వచ్చింది. 

ఓ  మహిళ https://m.ironfxsvip.vip లింక్‌‌‌‌‌‌‌‌ పంపించింది. అందులో ట్రేడింగ్ అకౌంట్‌‌‌‌‌‌‌‌లో ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌, లాభాలు వచ్చే విధానం గురించి డెమో ఇచ్చారు. తాము ఇచ్చే టిప్స్‌‌‌‌‌‌‌‌తో షేర్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని ఆశ చూపారు. దీంతో శ్రీనివాస్ రెడ్డి ముందుగా రూ.50 వేలు ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఇందుకు గాను 24 శాతం లాభం వచ్చినట్లు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో చూపారు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మించారు.

 ఇలా వారంలో రూ.1.5 కోట్లు పెట్టుబడిగా పెట్టించి.. రూ.3.5 కోట్లు ఆర్జించినట్లు డాలర్లలో చూపారు. శ్రీనివాస్ రెడ్డి పెట్టుబడిగా పెట్టిన రూ.1.5 కోట్లు సహా రూ.3.5 కోట్లు విత్‌‌‌‌‌‌‌‌డ్రా చేసుకునే ప్రయత్నం చేశాడు. ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌ అమౌంట్‌‌‌‌‌‌‌‌ను తీసుకోవాలంటే 30% ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ చెల్లించాలని రూ.1.34 కోట్లు వసూలు చేశారు. 

రాంగ్‌‌‌‌‌‌‌‌ ఎంట్రీ చేశారని విత్‌‌‌‌‌‌‌‌ డ్రాకు  నో చాన్స్  

ఆ తరువాత కూడా విత్‌‌‌‌‌‌‌‌డ్రా చేసుకునే అవకాశం ఇవ్వలేదు. పెద్ద మొత్తాన్ని డ్రా చేసుకోవాలంటే రూ.1.8 కోట్లతో  వీఐపీగా అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలన్నారు. కన్వర్జేషన్ ఫీజు పేరుతో మరో రూ.1.33 కోట్లు వసూలు చేశారు. విత్‌‌‌‌‌‌‌‌డ్రా చేసుకునేందుకు ఎంత ప్రయత్నించినా రిజెక్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఆయన ఒత్తిడి చేయడంతో రూ.1,88,888 చొప్పున రెండు విడతలుగా తీసుకునేందుకు అవకాశం ఇస్తున్నామన్నారు. ఇందుకు గాను శ్రీనివాస్  రెడ్డి రూ.1,88,888 లకు మొదటి రిక్వెస్ట్‌‌‌‌‌‌‌‌ పెట్టాడు. దీనికి సంబంధించి 6 గంటలలోగా అమౌంట్‌‌‌‌‌‌‌‌ క్రెడిట్‌‌‌‌‌‌‌‌ అవుతుందని నమ్మించారు. 

ఈ క్రమంలోనే విత్‌‌‌‌‌‌‌‌డ్రా చేసుకునేందుకు ఏంట్రీ చేసిన అమౌంట్‌‌‌‌‌‌‌‌ తప్పుగా ఎంట్రీ చేశారని అకౌంట్‌‌‌‌‌‌‌‌ ఫ్రీజ్‌‌‌‌‌‌‌‌ అయ్యిందని భయాందోళనకు గురి చేశారు. ఈ మొత్తం డబ్బు అన్‌‌‌‌‌‌‌‌ ఫ్రీజ్‌‌‌‌‌‌‌‌ చేయాలంటే రూ.2.5 కోట్లు చెల్లించాలని సూచించారు. ఇలా ఈ నెల 23వ తేదీ వరకు రూ.4.87 కోట్లు వసూలు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ సెక్యూరిటీ అధికారులు కేసు నమోదు చేశారు.