వానలతో బయటపడ్డ రియల్‌‌ మోసం

వానలతో బయటపడ్డ రియల్‌‌ మోసం

ఫొటోలో కనిపిస్తున్నది నల్గొండ జిల్లా కేంద్రం శివారులోని మోదుగులకుంట. అయితే కుంటలో రోడ్డు, కడీలు, కరెంట్ స్తంభాలు, వైర్లు కనిపిస్తున్నాయేంటని ఆలోచిస్తున్నారా ? ఇదే.. ‘పవర్ను అడ్డు పెట్టుకొని కౌన్సిలర్లు చేసిన మాయాజాలం. కుంట ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్న భూములను ఆక్రమించి వెంచర్ చేసేశారు. విషయం తెలిసి కూడా ఆఫీసర్లు రోడ్లు వేశారు.. కరెంట్ కనెక్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఐదు రోజుల పాటు వాన పడడంతో వెంచర్ బాగోతం బయటపడింది.

నల్గొండ మున్సిపాలిటీలో పలువురు కౌన్సిలర్ల సిండికేట్

చెరువులు, కుంటల ఎఫ్ టీఎల్ భూముల్లో వెంచర్లు

తాత్కాలిక నోటీసులతో చేతులు దులుపుకున్న ఆఫీసర్లు

బ్లాక్ చేసిన సర్వే నంబర్లలో ప్లాట్ల అమ్మకానికి ప్రయత్నాలు

రియల్ మాఫియా పేరిట పట్టణంలో అక్రమ వసూళ్లు

నల్గొండ, వెలుగు: మున్సి పాలిటీల్లో ఎల్ఆర్ఎస్, బీఆర్ ఎస్ స్కీం లను పకడ్బందీగా అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త మున్సి పల్ చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ నల్గొండ మున్సిపాలిటీల్లో మాత్రం అధికార పార్టీ కౌన్సిలర్లే కొత్త చట్టాన్ని నీరు గారుస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలోని కొందరు కౌన్సిలర్లతో చేతులు కలిపి సిండికేట్ గా మారారు. పట్టణంలో ఎక్కడ కొత్త వెంచర్ వెలిసినా, భవన నిర్మాణాలు జరిగినా అక్కడ వాలిపోతున్నారు. లేదంటే చెరువులు, కుంటల ఎఫ్ టీ ఎల్ భూములను ఆక్రమించి రియల్ వెంచర్లుగా మార్చేస్తున్నారు.

ఎఫ్ టీ ఎల్ భూముల్లో వెంచర్లు

చెరువులు, కుంటలకు సంబంధించి న ఎఫ్ టీఎల్ భూముల్లో రియల్ దందా నల్గొండలో జోరుగా సాగుతోంది. గేటెడ్ కమ్యూనిటీల పేరుతో ఇండ్లు నిర్మించడం, ప్లాట్లు విక్రయించడం చేస్తున్నారు. శివారు ప్రాంతాలైన చర్లపల్లి, ఆర్జాలబావి, కతాల్ గూడ ఏరియాల్లో ఎఫ్ టీ ఎల్ ల్యాండ్స్​ ఆక్రమించి ప్లాట్లుగా మార్చిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇవేమీ తెలియని ప్రజలు ఆ ప్రాంతాల్లో ఇండ్లు, ప్లాట్లు కొన్న ప్రజలు ఇప్పటి కీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ అక్రమాలకు కొనసాగింపుగా ఇప్పుడు కూడా భూములను ఆక్రమించి ప్లాట్లుగా మార్చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పట్టణ శివారు ప్రాంతాల్లోని కుంటలు, చెరువుల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. వీటి పరిధిలోని భూముల్లోనే అధికారపార్టీకి చెందిన పలువురు కౌన్సిలర్లు జాయింట్ వెంచర్లు వేశారు.

మోదుగులకుంటపై కన్ను

నల్గొండ పట్టణంలోని వసుంధర కాలనీ సమీపంలో గల సర్వే నంబరు 436/ఏ ప్రాంతాన్ని మోదుగులకుంట ఎఫ్ టీ ఎల్ గా గుర్తించారు. కానీ కొందరు వ్యక్తులు ఈ ప్రాంతంలోని నాలుగు ఎకరాల భూమిని ప్లా ట్లుగా మార్చారు. అధికార పార్టీకి చెందిన పలువురు కౌన్సిలర్లు దీనిపై కన్నేసి స్థలాన్ని కబ్జా చేయడంతో పాటు మట్టితో నిం పేస్తున్నారు. దీంతో కొద్ది రోజులుగా కురుస్తున్న వానల వల్ల కుంటలోకి నీరు భారీగా వచ్చింది. ఈ ల్యాండ్ ఎఫ్ టీ ఎల్ పరిధిలో ఉందని తెలిసినా ఆఫీసర్లు మాత్రం కరెం ట్ కనెక్షన్ ఇచ్చారు.. రోడ్లు వేశారు. ఇప్పుడు నీరు చేరడంతో మేల్కొ న్న ఆఫీసర్లు ఈ సర్వే నంబర్లలో ప్లా ట్లు కొనొద్దని ప్రకటించారే తప్ప వెంచర్ చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

అక్రమ వెంచర్లకు బేరం

నల్గొండ మున్సి పాలిటీలో గుర్తించి న అక్రమ వెంచర్లపైన కౌన్సి లర్లు కన్నే శారు. టౌన్ లో 12 చోట్ల అక్రమ వెంచర్లు ఉన్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. చర్లపల్లి, గంధవారిగూడెం, పానగల్, హైదరఖాన్ గూడ, సాగర్ రోడ్డు, మునుగోడు బైపాస్ రోడ్డు లింకు, నార్కట్ పల్లి అద్దం కి బైపాస్, మామిళ్లగూడెం, ముషంపల్లి రోడ్డు, హైదర్ఖాన్ గూడ లిటిల్ ఫ్లవర్ గర్ల్స్ కాలేజీ పక్కన గల పలు సర్వే నంబర్లలో అనధికారి లేఅవుట్లు గుర్తించారు. కానీ ప్లా ట్లు రిజిస్ర్టేషన్ కాకుండా ఆఫీసర్లు చర్యలీ తీసుకోలేదు. దీంతో రియల్టర్లు ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టి ప్లాట్లు అమ్మేందుకు విశ్వప్రయత్నా లు చేస్తున్నట్లు సమాచారం. దీనిని అదునుగా భావించిన కొందరు కౌన్సిలర్లు రియల్టర్లతో బేరసారాలకు రెడీ అయ్యారు. అక్రమ లేఅవుట్లకు అండగా ఉంటామని, పర్మిషన్లు ఇప్పిస్తామని చెబుతూ వసూళ్లకు పాల్పడుతున్నారు.

వసూళ్ల పంచాయితీ

అధికార పార్టీ నుంచి నలుగురు, ప్రతిపక్ష పార్టీల నుంచి ముగ్గురు కౌన్సి లర్లు ఏకమై వసూళ్ల పర్వానికి తెర తీసినట్లు తెలిసింది. మున్సి పాలిటీలో ఏ వార్డు నుంచి మ్యుటేషన్ జరగాలన్నా ప్రతిదానికి ఎంతో కొంత ము ట్టచెప్పాల్సిందే . అలాగే పట్టణంలో ఏ వార్డులో ఎక్కడ కొత్త బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ జరిగినా అక్కడ వీళ్లు వాలిపోతున్నారు. దేవరకొండ రోడ్డు, పద్మానగర్ లో కొత్తగా కమర్షియల్ కాంప్లెక్సులు, హాస్పిటళ్లు, ఇండ్లు కడుతున్నారు. దీంతో ఈ ఏడుగురు కౌన్సిలర్లు బిల్డర్లను బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. తమ పరిధిలోకి రాని వార్డుల్లోకి వచ్చి అక్రమాలకు పాల్పడుతుండడంతో స్థానిక కౌన్సిలర్లు ఆందోళన చెందుతున్నా రు. ఇదే విషయాన్ని ఆ పార్టీ ముఖ్యనేత దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం.

ప్రలోభాలకు గురికావొద్దు

మోదుగులకుంటను పూర్తిగా సర్వే చేయిస్తాం. ఈ వర్షాలకే మునిగిపోయే పరిస్థితి వస్తే భవిష్యత్ లో మరింత నష్టం జరుగుతుంది. ఎఫ్ టీఎల్ కన్ఫర్మ్ అయ్యాకే తర్వాతి పనులకు పర్మిషన్ ఇస్తాం. అలాగే పట్టణంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా చర్య లు తీసుకుంటాం. ప్రజలు కూడా రియల్టర్ల ప్రలోభాలకు గురికావొద్దు. శరత్ చంద్ర, మున్సిపల్ కమిషనర్, నల్గొండ.