హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జవహర్ నగర్లో దారుణ హత్య జరిగింది. సాకేత్ కాలనీ ఫోస్టర్ బిల్లా బాంగ్ స్కూల్ సమీపంలో రియల్టర్ వెంకట రత్నంను కిరాతకంగా హత్య చేశారు. సోమవారం (డిసెంబర్ 8) ఉదయం బైక్పై వెళ్తున్న రత్నంను ప్లాన్ ప్రకారం వెంబడించిన గుర్తు తెలియని దుండగులు నడిరోడ్డుపై తుపాకీతో కాల్చి, వేట కత్తితో దారుణంగా నరికి చంపారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు.
ఘటన స్థలం నుంచి ఒక బుల్లెట్, వేట కత్తి స్వాధీనం చేసుకుని మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వ్యక్తిగత, ఆర్థిక వ్యవహరాలే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రత్నంను అతికిరాతకంగా హత్య చేసిన దుండగులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు. ఘటన స్థలంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పొద్దు పొద్దుగాలే రియల్టర్ రత్నం దారుణ హత్యతో జవహర్ నగర్ ఉలిక్కిపడింది.
