
మహబూబ్‌నగర్, వెలుగు:గ్రేటర్ హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో గత నెల 14 నుంచి 17 వరకు వేలం వేసిన రాజీవ్‌స్వగృహ ప్లాట్లను పోటీ పడి దక్కించుకున్న రియల్టర్లు, బిల్డర్లు ఇప్పుడు డ్రాప్ అవుతున్నారు. సర్కారు నిర్ణయించిన రేటుకు మూడు, నాలుగు రెట్లు పాడినవాళ్లే డిపాజిట్లు వదులుకొని బిచాణా ఎత్తేయడం చర్చనీయాంశంగా మారింది. మహబూబ్‌నగర్, కామారెడ్డి లాంటి చోట్ల తమ చుట్టు పక్కలున్న వెంచర్ల రేట్లు పెంచుకునేందుకే ఈ స్థాయిలో పాడారని అప్పట్లోనే అనుమానాలు వచ్చాయి. అందుకు తగినట్లే ఆయా చోట్ల అత్యధికంగా పాడిన రియల్టర్లే డ్రాప్ అవుతుండడంతో ఆ రేట్లకు అటు ఇటుగా ప్లాట్లు దక్కించుకున్న సామాన్యులు సైతం అయోమయంలో పడ్డారు.
పోటాపోటీగా పాడి..
మార్చి 14 నుంచి 17 వరకు నాలుగు రోజులపాటు జీహెచ్ఎంసీ తో పాటు వికారాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్, గద్వాల్, కామారెడ్డి, పెద్దపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో రాజీవ్ స్వగృహ ప్లాట్లకు వేలం నిర్వహించారు. ఈ ప్లాట్ల అమ్మకంతో ప్రభుత్వానికి రూ.399.46 కోట్ల ఆదాయం వస్తుందని ఆఫీసర్లు అంచనా వేయగా జీహెచ్ఎంసీతో పాటు మహబూబ్‌నగర్, కామారెడ్డి లాంటి చోట్ల వేలం పాటలు పోటాపోటీగా జరగడంతో ఏకంగా రూ.567.25 కోట్ల ఆమ్దానీ వచ్చింది. అయితే, ఇప్పుడు సీన్ రివర్సయ్యింది. ప్లాట్లను దక్కించుకున్న వారు డీడీల డబ్బులు వదులుకొని, 33 శాతం అమౌంట్ కట్టడం లేదు.
భూత్పూర్లో 80 మంది పైసలు కట్టలే..
మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్మున్సిపాలిటీలోని రాజీవ్ స్వగృహ (సారిక టౌన్షిప్)లో 240 ప్లాట్లకు వేలం వేయగా రూ.10 వేలు డీడీలు చెల్లించి 1,300 మంది టోకెన్లను తీసుకోగా, వేలంలో 240 మంది ప్లాట్లను దక్కించుకున్నారు. గజం విలువను గవర్నమెంట్రూ.8 వేలకు ఫిక్స్ చేయగా, బిల్డర్లు, రియల్టర్లు స్థలాన్ని బట్టి రూ.26 వేలు, రూ.25 వేలు, రూ.24,800, రూ.23,600, రూ.22,400, రూ.21,100, రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకు పాట పాడి దక్కించుకున్నారు. కానీ, ఇప్పుడు వీరంతా వెనక్కి తగ్గారు. వేలం ముగిసిన వారంలోనే 33 శాతం డబ్బులు కట్టాల్సి ఉండగా, 27 రోజులవుతున్నా దాదాపు 80 మంది డబ్బులు కట్టేలేదు. ఇందులో సారిక టౌన్ షిప్చుట్టూ ఉన్న రియల్ఎస్టేట్వెంచర్లకు సంబంధించిన వారు 45 మంది వరకు ఉండగా, పది మంది వరకు టౌన్ షిప్ కు కొన్ని అడుగుల దూరంలో వెంచర్లు వేసిన వారు ఉన్నారు. వీరంతా అమౌంట్ కట్టకుండా, డీడీలను వదులుకున్నట్లు తెలిసింది. మిగతా వారు గవర్నమెంట్, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావడంతో వివిధ కారణాలతో డ్రాప్ అవుతున్నామని చెబుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని ధరణి టౌన్షిప్లో 217 ప్లాట్లకు వేలం నిర్వహించగా, 191 మంది మాత్రమే 33 శాతం అమౌంట్కట్టారు. మిగతా 26 మంది అమౌంట్కట్టకుండా డీడీలు వదులుకున్నారు. వీరిలో బిల్డర్లు, రియల్టర్లు ఉన్నారు.
కావాలనే హైప్..
రియల్టర్లు, బిల్డర్లు పక్కా స్కెచ్‌తో ప్లాట్ల వేలంలో పాల్గొన్నట్టు తెలిసింది. జిల్లాకు చెందిన కొందరు ఉన్నతాధికారులు వీరితో ముందే మీటింగ్‌పెట్టి రేట్లను పెంచాలని సూచించడంతో ఆ స్థాయిలో పాట పాడారని తెలుస్తోంది.
రూ.10 వేలుంటే రూ.20 వేలకు పెంచిన్రు
సారిక టౌన్ షిప్లో ప్లాట్ల వేలం జరగనంత వరకు చుట్టూ ఉన్న వెంచర్లలో గజం రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఉండేది. రోడ్డు బిట్అయితే ఎక్స్ట్రా రూ.500 ఎక్కువ తీసుకునేవారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో గజం రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంది. ఈ ధరలు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో కూడా లేవు. వేలంలో రియల్టర్లు, బిల్డర్లు పాల్గొని రేట్లను పెంచడంతో ఇప్పుడు వారి వెంచర్లకు ఫుల్ గిరాకీ వస్తోంది. వీరంతా రాజీవ్ స్వగృహలో గెలుచుకున్న ప్లాట్లను వద్దనుకొని రూ.10 వేల డీడీలను వదులుకుంటున్నారు. రూ.10 వేలు పోయినా, ధరలు పెరగడంతో ఒక్కో ప్లాట్మీద రూ.10 లక్షల వరకు లాభం వస్తుండటంతో జోష్‌లో ఉన్నారు.
లోన్లు ఇవ్వని బ్యాంకులు
టౌన్షిప్లో బిల్డర్లు, రియల్టర్లు కాకుండా ప్లాట్లను గెలుచుకున్న గవర్నమెంట్, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. గజం రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఉండగా, రూ.14 వేల నుంచి రూ.26,650 వరకు పెట్టారు. ఒకటి, రెండు ప్లాట్లకు మాత్రమే గజం రూ.10 వేల లోపు పలికింది. దీంతో లోన్ల కోసం బ్యాంకులకు వెళ్తున్న వారికి, అక్కడి సిబ్బంది చెప్తున్న ఆన్సర్ విని షాక్ తింటున్నారు. అక్కడ మార్కెట్ రేట్కేవలం రూ.12 వేలలోపు మాత్రమే ఉందని, పాడినంత ఇవ్వలేమని చెబుతున్నారు.
ప్లాన్ ప్రకారమే వేలం
ప్లాన్ ప్రకారమే అక్కడ వేలం జరిగిందనుకుంటున్నా. టౌన్‌షిప్‌కు దగ్గర్లో ఉన్న వెంచర్‌కు చెందిన వ్యక్తులే వేలంలో పాల్గొన్నరు. అంతా కలిసి ఎక్కువ రేట్లకు పాట పాడి ఎవరికి దక్కకుండా చేసిన్రు. దీంతో నేను ఒక ప్లాట్ పాడుదామనుకుని అంత పెట్టలేక మరొకటి పాడాల్సి వచ్చింది. నేను పాడిన ప్లాట్ వాల్యూవేషన్ రూ.40 లక్షలవుతోంది. టౌన్షిప్ కు పోయి చూస్తే వీధి పోటు ఉంది. బిట్ కూడా క్రాస్‌గా ఉంది. దాని వల్ల 70 నుంచి 80 గజాల వరకు పోతుంది. దీంతో నాకు రూ.10 లక్షల లాస్ అవుతోంది. అందుకే రూ.10 వేల డీడీని వదులుకున్నా.
–సుంకేసుల శ్రీనివాసులు, మహబూబ్‌నగర్
లెవెల్ చేసి ఇయ్యరట
200 గజాల ప్లాట్‌ను వేలంలో గజానికి రూ.15,700 చొప్పున పాడి గెలుచుకున్నా. ఇప్పుడు ప్లాట్ దగ్గరకు పోయి చూస్తే గుంతలో ఉంది. నా ప్లాట్లే కాదు దాదాపు ఏడు ప్లాట్లు అట్లనే ఉన్నయ్. వాటిని లెవెల్చేసి ఇవ్వమని కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ను అడిగినం. వాళ్లు స్పందించలే. అందకే వదిలేసుకున్నా.
–నలవెల్లి వెంకటేశ్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, మహబూబ్‌నగర్