తహశీల్దార్ సజీవదహనం: ఏడెకరాల భూ వివాదం వల్లేనా?

తహశీల్దార్ సజీవదహనం: ఏడెకరాల భూ వివాదం వల్లేనా?
  • తహశీల్దార్ కు నిప్పంటించిన నిందితుడికీ తీవ్ర గాయాలు
  • కాలిన గాయాలతోనే పోలీస్ స్టేషన్ దగ్గరకి వచ్చాడు
  • ఆస్పత్రిలో చికిత్స.. పరిస్థితి విషమంగా ఉంది: సీపీ భగవత్

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి ఓ దుండగుడు సజీవ దహనం చేశాడు. ఇవాళ మద్యాహ్నం ఒంటి గంట సమయంలో జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగింది. భారీగా పోలీసులు అక్కడికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. ఓ రైతు తన భూమికి సంబంధించిన పట్టా వివాదం విషయంలో తనకు అన్యాయం జరిగిందనే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

దీనిపై ప్రాథమిక వివరాలను రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ మీడియాకు చెప్పారు.

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగుడికి  ఓ రైతు అని తెలిపారు సీపీ భగవత్. ఈ ఘటనలో అతడికి కూడా మంటలు అంటుకుని తీవ్ర గాయాలయ్యాయని, పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.

మధ్యాహ్నం 1 గంట సమయంలో అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ కార్యాలయం నుంచి తమకు ఫోన్ వచ్చిందన్నారు సీపీ. వెంటనే తాము ఇక్కడికి చేరుకున్నామన్నారు. తాము వచ్చేటప్పటికే తహశీల్దార్ విజయారెడ్డి మరణించారని చెప్పారు భగవత్. ఆమెపై పోసింది కిరోసినా లేక పెట్రోలా అన్నది తేలాల్సి ఉందని చెప్పారు.

నిందితుడి వివరాలు

నిందితుడు సురేశ్

నిందితుడు గౌరెల్లి గ్రామానికి చెందిన సురేశ్ అని చెప్పారు పోలీస్ కమిషనర్ భగవత్. అతడికి సంబంధించిన 7 ఎకరాల భూమి వివాదంలో ఉందని, దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోందని చెప్పారు. ఈ విషయమై తహశీల్దార్ పై దాడి చేశాడా లేక మరేదైనా కారణంతో చేశాడా అన్నది తేలాల్సి ఉందన్నారు. అతడిపై హత్యా నేరం ఫైల్ చేస్తున్నామని, ఉరి శిక్ష పడే అవకాశం ఉందని చెప్పారు సీపీ మహేశ్ భగవత్.

60 శాతం కాలిన గాయాలతో స్టేషన్ కు..

తహశీల్దార్ విజయారెడ్డికి లైటర్ తో నిప్పంటించాడని, ఆ  సమయంలో సురేశ్ కూ మంటలు అంటుకున్నాయని చెప్పారు సీపీ. ఆ కాలిన గాయాలతోనే అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ వరకూ వచ్చాడని, అక్కడ బయటపడిపోయాడని తెలిపారు. తనకు అన్యాయం జరిగిందని చెప్పాడని, దాదాపు 60 శాతం కాలిన గాయాలతో ఉన్న సురేశ్ ను ఆస్పత్రికి తరలించామని చెప్పారు భగవత్. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందన్నారాయన.