హైడ్రా బాధితులకు భరోసా ఇవ్వండి

హైడ్రా బాధితులకు  భరోసా ఇవ్వండి
  • బీజేపీ కార్పొరేటర్లకు కిషన్ రెడ్డి సూచన
  • హైడ్రా, మూసీ సుందరీకరణ, సభ్యత్వ నమోదుపై రివ్యూ

హైదరాబాద్, వెలుగు: హైడ్రా కూల్చివేతలతో రోడ్డున పడుతున్న పేదలకు అండగా ఉంటామని భరోసా కల్పించాలని పార్టీ నేతలకు కేంద్రమంత్రి,  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సూచించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం బీజేపీ కార్పొరేటర్లు, గ్రేటర్ పరిధిలోని పార్టీ జిల్లాల అధ్యక్షులు, ముఖ్యనాయకులతో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీకరణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదుపై కార్పొరేటర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. హైడ్రా కూల్చివేతలపై ప్రజలు ఏమనుకుంటున్నారని, ప్రభుత్వంపై ప్రజల స్పందన ఎలా ఉందనే అంశాలను వారి నుంచి సేకరించారు. 

మూసీ సుందరీకరణ అంటూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల ఇండ్లను అన్యాయంగా కూలుస్తోందని కిషన్ రెడ్డి వారికి వివరించారు. బీజేపీ మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదని, అయితే పేదల ఇండ్లను కూల్చివేయడం మాత్రం ముమ్మాటికీ తప్పేనని చెప్పారు. మూసీ వెంట రిటైనింగ్ వాల్ కట్టి రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం.. కూల్చివేతలు చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.  పేదలకు పార్టీకి చెందిన కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలంతా అండగా ఉండాలని..భరోసా ఇవ్వాలని కోరారు. కాగా, మూసీ పరివాహక ప్రాంతమైన కార్వాన్ లో శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. ప్రజల బాధలను నేరుగా తెలుసుకోనున్నారు.