టెన్షన్.. టెన్షన్..‘మున్సిపల్’ అభ్యర్థులకుతప్పని రెబల్స్ దడ

టెన్షన్.. టెన్షన్..‘మున్సిపల్’ అభ్యర్థులకుతప్పని రెబల్స్ దడ
  •  కులం కార్డు.. నగదు బదిలీతో ఆకట్టుకునే ప్రయత్నం..
  •  ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థుల ఆపసోపాలు

నాగర్​ కర్నూల్, వెలుగు : మున్సిపాలిటీల్లో ఎన్నికల పోరు క్లైమాక్స్‌‌‌‌ కు చేరుకుంది. ఈక్రమంలో అభ్యర్థుల్లో టెన్షన్​ పెరుగుతోంది.  లోన టెన్షన్ ఉన్నా బయటికి గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని నాగర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్  మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు రెబల్స్ దడ పుట్టిస్తున్నారు.

పరిమిత సంఖ్యలో ఓటర్లు ఉన్న వార్డుల్లో ఎవరి గెలుపు అవకాశాలను దెబ్బతీస్తారో అన్న ఆందోళన అభ్యర్థులను వేధిస్తోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు నానా పాట్లు పడుతున్నారు. కులం కార్డును విరివిగా వాడుతున్నారు. కొన్ని చోట్ల కుల సంఘాలకు వంట పాత్రల పంపిణీతో మొదలవ్వగా, మరికొన్ని చోట్ల స్పెషల్​ గిఫ్ట్​లు ఇచ్చేందుకు సిద్ధమవుతుండటం గమనార్హం. 

తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా.. 

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో పాతకాపులను కాదని, కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇవ్వడంపై అసంతృప్తి ఎగిసిపడుతోంది. ఎంపీ మల్లు రవి అనుచరుడైన తైలీ శ్రీనివాసులు వంటి సీనియర్లకు టికెట్ దక్కకపోవడంతో వారు రెబల్స్‌‌‌‌ గా బరిలో నిలిచారు. గత పదేండ్లుగా ఇక్కడ పట్టున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తన అభ్యర్థులను గెలిపించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

కొల్లాపూర్‌‌‌‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు ముందస్తుగా వన్- టు -వన్ సమావేశాలు నిర్వహించి అసమ్మతిని అణచివేసే ప్రయత్నం చేసినప్పటికీ, అక్కడ త్రిముఖ పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. కల్వకుర్తి మున్సిపాలిటీలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి టికెట్లు ఆశించి భంగపడిన సోమ్లా నాయక్, కుడుముల మనోహర్ రెడ్డి లాంటి నాయకులు ఇండిపెండెంట్లుగా రంగంలోకి దిగి ప్రధాన పార్టీల ఓట్ల బ్యాంకుకు గండి కొట్టేలా ఉన్నారు.

కొన్ని వార్డుల్లో కేవలం 300 ఓట్లు సాధిస్తే గెలుస్తామనే ధీమాతో అభ్యర్థులు ఉండటం విశేషం. ఇక ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న వార్డుల్లో ఎంఐఎం పోటీ చేస్తుండటంతో, ఆ ఓట్లు ఎటు చీలుతాయోనని కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు టెన్షన్ పడుతున్నారు. బీఎస్పీ, సీపీఐ అభ్యర్థుల ప్రభావం కూడా గెలుపోటములపై పడే అవకాశం ఉంది. 

వలస ఓటర్ల కోసం..  

అభ్యర్థులు తమ గెలుపు కోసం సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. స్థానిక పట్టణాల నుంచి హైదరాబాద్, మహబూబ్‌‌‌‌నగర్ లాంటి ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్ల కోసం అభ్యర్థులు ప్రత్యేకంగా ‘వార్ రూమ్’లను ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు ప్రతి వార్డులో 10 నుంచి 15 శాతం ఉన్న ఈ వలస ఓటర్ల జాబితాను సిద్ధం చేసి, వారి బంధువులతో ఫోన్లు చేయిస్తున్నారు.

రానుపోను చార్జీలతో పాటు, ఓటుకు నిర్ణయించిన మొత్తాన్ని ముందే ఆన్‌‌‌‌లైన్ ద్వారా ట్రాన్స్​ఫర్​ చేస్తూ హామీలు పొందుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు, కుల సంఘాల నాయకులకు ఈ ఎన్నికల్లో ఫుల్ డిమాండ్ ఏర్పడింది.