కేరళలో అర కిలోమీటర్ వెనక్కి వెళ్లిన సముద్రం.. సునామీ అంటూ భయాందోళనలు

కేరళలో అర కిలోమీటర్ వెనక్కి వెళ్లిన సముద్రం.. సునామీ అంటూ భయాందోళనలు

కేరళలో సునామీ కలకలం.. సముద్రం 50 అడుగులు వెనక్కి వెళ్లింది.. పౌర్ణమి, అమావాస్య పౌర్ణమికి సహజంగానే ఆటుపోట్లు ఉంటాయి.. సముద్రం పోటెత్తుతుంది. అందుకు భిన్నంగా కేరళ రాష్ట్రం అలప్పుజాలో రెండు కిలోమీటర్ల పరిధిలో.. సముద్రం అర కిలోమీటర్ వెనక్కి వెళ్లింది. ఊహించని పరిణామంలో స్థానిక మత్స్యకారులు భయాందోళనలకు గురయ్యారు. 

2024, మార్చి 19వ తేదీ ఉదయం 6 గంటల 30 నిమిషాల సమయంలో.. అలప్పుజా ఏరియాలోని అయ్యంకోయిక్కల్ నుంచి పురక్కాడ్ బీచ్ వరకు ఉన్న రెండు కిలోమీటర్ల దూరం వరకు.. సముద్రం అర కిలోమీటర్ వెనక్కి వెళ్లింది. దీంతో తీర ప్రాంత ప్రజలు వణికిపోయారు. సునామీ వస్తుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఒక్కసారిగా సముద్రం వెనక్కి వెళ్లిపోవటం ఏంటనే చర్చ మొదలైంది. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు స్థానికులు. 

అధికారులు అప్రమత్తం అయ్యి.. వాతావరణ శాఖ, ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. సముద్రం వెనక్కి వెళ్లటంపై పరిశీలన చేయగా.. ఎలాంటి సునామీ హెచ్చరికాలు లేవని.. సునామీ వచ్చే అవకాశం లేదని తేల్చేశారు. సముద్రంలో సహజంగా జరిగే మార్పుల వల్ల ఇలా జరిగిందని స్పష్టం చేశారు. 

2004, జనవరి 26వ తేదీ ఈ ప్రాంతంలో సునామీ వచ్చింది. అప్పట్లో సముద్రంలో తీవ్రమైన ఆటుపోట్లకు గురైంది. ఆ సంఘటనను మళ్లీ గుర్తు చేసుకున్నారు తీర ప్రాంత వాసులు. కేవలం 2 కిలోమీటర్ల పరిధిలో.. సముద్రం అర కిలోమీటర్ వెనక్కి వెళ్లటం చర్చనీయాంశం అయ్యింది. 

సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్లటంతో.. తీర ప్రాంతానికి వస్తున్న బోట్లు ఇబ్బంది పడ్డాయి. తీరానికి చాలా దూరంలోనే ఆగిపోయాయి. ప్రతినెలా అమావాస్య, పౌర్ణమి సమయాల్లో సముద్రంలో ఆటుపోట్లు సహజంగా వస్తాయి.. ఈ సారి మరింత ఎక్కువగా వచ్చాయని.. ఇలాంటి సమయంలో కొన్ని సార్లు సముద్రం వెనక్కి వెళ్లటం సహజం అని స్పష్టం చేస్తున్నారు అధికారులు. ఉదయం 6 గంటల 30 నిమిషాలకు వెనక్కి వెళ్లిన సముద్రం.. ఉదయం 11 గంటల సమయంలో తిరిగి యథాతథ స్థితికి రావటంతో.. తీర ప్రాంతంలోని జనం ఊపిరిపీల్చుకున్నారు. తీరానికి రావాల్సిన బోట్లు సురక్షితంగా వచ్చాయి.  సముద్రంలో ఎలాంటి భూకంపాలు లేవని.. అలాంటి సంకేతాలు రాలేదని.. సునామీ వార్నింగ్స్ లేవని అధికారులు ప్రకటించారు.