- ఉపాధి హామీ స్కీమ్‌ను రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్నరు
- స్వాతంత్ర్య పోరాటం, దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పాత్ర ఎనలేనిది
- కాంగ్రెస్ ప్రధానులు వేసిన పునాదులతోనే దేశం అభివృద్ధి చెందిందని వ్యాఖ్య
- గాంధీభవన్‌లో కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు
హైదరాబాద్, వెలుగు: కార్పొరేట్లకు మేలు చేయడమే బీజేపీ విధానమని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. కేంద్రం పేదలను దోచుకుని పెద్దలకు పెడుతున్నదని ఫైర్ అయ్యారు. “బీజేపీ పెత్తందారి పార్టీ. పేదలను దోచుకుని అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్లకు పెడుతున్నది. బీదవాడి గోడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పట్టట్లేదు. కార్పొరేట్లకు మేలు చేసే విధానాలు తప్ప.. ప్రజల గురించి మోదీ ప్రభుత్వం ఆలోచించడం లేదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ స్కీమ్ నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించిన కేంద్రం.. ఆ పథకాన్నే పూర్తిగా రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. అందుకే ఈ స్కీమ్‌లో కేంద్ర, రాష్ట్ర వాటా అంటూ సాకులు చెబుతున్నదని అన్నారు.
ఆదివారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను మహేశ్ గౌడ్ ఆవిష్కరించారు. అనంతరం గాంధీ, నెహ్రూ, పటేల్ విగ్రహాలకు నివాళులర్పించారు. అలాగే ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్‌గా మోతె రోహిత్ ఆదివారం గాంధీభవన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. ఈ రెండు కార్యక్రమాల్లో మహేశ్ గౌడ్ మాట్లాడారు. కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ అని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్‌తోనే దేశాభివృద్ధి..
ప్రపంచంలోనే ఓల్డెస్ట్ పార్టీ కాంగ్రెస్ అని, ఇది అనేక మంది మహనీయుల సంకల్పంతో ఏర్పడిందని మహేశ్ గౌడ్ అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో, దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పాత్ర ఎనలేనిదని కొనియాడారు. “మహనీయుల త్యాగం ముందు అధికార దాహంతో రాజ్యమేలుతున్న నాయకులు ఎంత? నెహ్రూ ప్రధాని కాకపోయుంటే ఈ దేశం ఏమయ్యేదో ఊహించలేం. ఆయన పోషించిన పాత్ర వల్లే దేశం ఈ స్థాయికి ఎదిగింది” అని అన్నారు. కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
