బాండ్లు పోస్టులో పంపించారు .. బాండ్ల వివరాలపై పార్టీల వింత జవాబులు

బాండ్లు పోస్టులో పంపించారు .. బాండ్ల వివరాలపై పార్టీల వింత జవాబులు

న్యూఢిల్లీ : చట్టపరమైన నిబంధనలను ఉటంకిస్తూ దాతల వివరాలను వెల్లడించేందుకు పార్టీలు నిరాకరిస్తున్నాయి. పోస్ట్​ ద్వారా బాండ్స్​ అందుకున్నామని, వాటిపై దాతల పేర్లు లేవని మరికొన్ని పార్టీలు దాటవేస్తున్నాయి. కింగ్​ సాంటియాగో మార్టిన్స్​ ఫ్యూచర్​ గేమింగ్స్​ లాటరీ సంస్థనుంచి 77% నిధులు పొందిన డీఎంకే పార్టీ 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు డోనర్స్ వివరాలను దాదాపుగా మొత్తం వెల్లడించింది.

రాజకీయ పార్టీలకు అందే విరాళాల్లో కచ్చితత్వం పెంచడం, అదే సమయంలో దాతల వివరాలను గోప్యంగా ఉంచడమే లక్ష్యంగా ఎలక్టోరల్​ బాండ్​ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో బీజేపీ పేర్కొన్నది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్​ పార్టీ తమకు వచ్చిన నిధులు, ఎలక్టోరల్​ బాండ్స్​ కొన్న దాతలు, వారి బ్యాంకు అకౌంట్​ వివరాలు, ఆ నిధులు ఏ తేదీన జమయ్యాయి? అనే వివరాలు ఇవ్వాలని ఎస్​బీఐకి లేఖ రాసింది.

కాగా, ఎలక్షన్​ కమిషన్​కు తాము సమర్పించిన వివరాలనే రాజకీయ పార్టీలకు ఇస్తామని ఎస్​బీఐ కాంగ్రెస్​కు జవాబిచ్చింది. రూ.లక్ష, రూ. పది లక్షల బాండ్ల వివరాలను వెల్లడించిన సమాజ్​వాదీ పార్టీ.. రూ. కోటిచొప్పున వచ్చిన పది ఎలక్టోరల్​ బాండ్లపై దాతల పేర్లు లేవని పేర్కొన్నది. దాతల పేర్లు వెల్లడించేందుకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సంసిద్ధంగా లేదు. తమ పార్టీకి వచ్చిన బాండ్లన్నీ పోస్టు ద్వారానే వచ్చాయని, దాతలెవరో తమకూ తెలియదని తృణమూల్​ కాంగ్రెస్ (టీఎంసీ)​ పేర్కొన్నది.

బాండ్లు సమర్పించిన దాతల వివరాలను పొందుపర్చలేదని, తాము వారికి రసీదులు అందజేయలేదంటూ డోనర్ల వివరాలు వెల్లడించేందుకు శరద్​ పవార్​ నేతృత్వంలోని ఎన్సీపీ విముఖత వ్యక్తంచేసింది. ఎలక్టోరల్​ బాండ్ల వివరాలు తెలుసుకునేందుకు  పార్టీకి 30 లక్షల విరాళం అందజేసిన వీఎం సాల్గన్కర్​ బ్రదర్స్​ను గోవా కాంగ్రెస్​ సంప్రదించింది. తమ పార్టీకి వచ్చిన  రూ. 1.5 కోట్లకు సంబంధించిన విరాళాల వివరాలు అందుబాటులో లేవని ఆర్జేడీ వెల్లడించింది. ఎవరో తమ పార్టీకి 2019లో రూ.10 కోట్ల విలువైన ఎలక్టోరల్​ బాండ్స్​ను ఎన్వలప్​లో పెట్టి కార్యాలయానికి పంపించారని, వాటిని రెడీమ్​ చేసుకున్నామని ఈసీకి నితీశ్​ కుమార్​ నేతృత్వంలోని జనతాదళ్(యూ) తెలిపింది.