నల్గొండ, వెలుగు: నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో యాసంగి సీజన్‌కు సంబంధించిన వడ్ల కొనుగోళ్లు రికార్డు స్థాయిలో సాగుతూ చివరి దశకు చేరుకున్నాయి. అనేక సవాళ్ల మధ్య ప్రారంభమైన సేకరణ ప్రక్రియ, ప్రస్తుతం మంత్రులు, ఉన్నతాధికారుల ఆదేశాలతో ఊపందుకుంది. ఇప్పటికే నిర్దేశిత లక్ష్యాన్ని మించి కొనుగోళ్లు జరగగా, మిగిలి ఉన్న 10 శాతం ధాన్యాన్ని సేకరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రెండు జిల్లాల్లో కలిపి ఇప్పటికే దాదాపు 11 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేశారు. సగానికి పైగా కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే మూతపడ్డాయి.
వారం రోజుల్లో 5 లక్షల మెట్రిక్ టన్నులు..
ఈ సీజన్లో ఏప్రిల్ మొదటివారం నుంచి వడ్ల కొనుగోళ్లు ప్రారంభం కాగా, మే నెలాఖరు వరకు పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. కానీ ప్రారంభంలో తాలు, తేమ పేరుతో కోతలు విధించడం, లారీల కొరత, మిల్లుల వద్ద దిగుమతి జాప్యం లాంటి సమస్యల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై రైతులు ఆందోళనలు, రాస్తారోకోలు చేపట్టడంతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ స్వయంగా కేంద్రాలను తనిఖీ చేసి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
లారీల కొరతను అధిగమించడానికి సిమెంట్ ఫ్యాక్టరీలు, పరిశ్రమల వాహనాలను కొనుగోలు కేంద్రాల వైపు మళ్లించారు. మిల్లుల వద్ద పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించడంతో, కేవలం వారం రోజుల్లోనే రికార్డు స్థాయిలో 5 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను సేకరించడం సాధ్యమైంది. ఇప్పటికే 90శాతం కొనుగోళ్లు ముగియగా, ఈ నెలాఖరులోగా మిగిలిన 10శాతం ధాన్యం కొనుగోలు పూర్తిచేసేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
ఏ జిల్లాలో.. ఏ ఏ పరిస్థితి..?
నల్గొండ జిల్లాలో రబీ సీజన్ లో 6.50 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోళ్లు టార్గెట్ గా పెట్టుకోగా, శుక్రవారం నాటికి రూ. 1682.74 కోట్ల విలువ చేసే 7 లక్షల 42 వేల 529 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 459 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా వీటిలో 217 కొనుగోలు కేంద్రాలను క్లోజ్ చేశారు.
ప్రస్తుతం 247 సెంటర్లలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటివరకు కొనుగోళ్లు చేసిన వాటిలో 6,90 ,171 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు తరలించారు. 5,49,974 మెట్రిక్ టన్నుల ధాన్యానికి ట్రక్ షీట్లు జనరేట్ చేయగా, 5,78,979 మెట్రిక్ టన్నుల ధాన్యానికి ట్యాబ్ ఎంట్రీ కూడా పూర్తి చేశారు. ధాన్యం అమ్మిన రైతులకు ఇప్పటివరకు రూ.1,313.89 కోట్లు చెల్లించారు.
సూర్యాపేట జిల్లాలో 3.40 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోళ్లు టార్గెట్ గా పెట్టుకోగా, శుక్రవారం నాటికి 48,897 మంది రైతుల నుంచి 3,39, 065 మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోళ్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 354 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, వీటిలో 193 కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లు పూర్తి కాగా వాటిని క్లోజ్ చేశారు. ప్రస్తుతం 120 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.
ఇప్పటివరకు కొనుగోలు చేసిన వడ్లలో 3,32,317 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు తరలించారు. 3,32,317 మెట్రిక్ టన్నుల ధాన్యానికి ట్రక్ షీట్లు జనరేట్ చేయగా, 2,39,761 మెట్రిక్ టన్నుల ధాన్యానికి ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేశారు. ధాన్యం అమ్మిన రైతులకు ఇప్పటివరకు రూ.793.90 కోట్లు చెల్లించారు.
తడిసిన వడ్ల కొనుగోలు.. రైతులకు ఊరట
ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వం స్పందించి తడిసిన వడ్లను సైతం కొనుగోలు చేయాలని నిబంధనలు సడలించడంతో అన్నదాతలకు పెద్ద ఊరట లభించింది. నష్టపోయే ప్రమాదం నుంచి బయటపడ్డామని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోళ్లు దాదాపు చివరి దశకు చేరుకోవడంతో, మిగిలిన ధాన్యాన్ని కూడా త్వరగా సేకరించి రైతులకు వారం రోజుల్లోనే ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు యంత్రాంగం వేగంగా చర్యలు చేపడుతోంది.
