రికార్డుస్థాయిలో వరి సాగు.. ఇప్పటికే 50 లక్షల ఎకరాల్లో నాట్లు

రికార్డుస్థాయిలో వరి సాగు.. ఇప్పటికే 50 లక్షల ఎకరాల్లో నాట్లు
  • వానాకాలాన్ని మించి యాసంగి వరి!
  • ఫిబ్రవరి రెండో వారం నాటికి 50 లక్షల ఎకరాల్లో సాగు
  • ఇప్పటికే 31.53 లక్షల ఎకరాల్లో పడిన నాట్లు
  • ఈ ఏడాది ఖరీఫ్ లోనూ 45 లక్షల ఎకరాల్లో వరి
  • గతేడాది యాసంగిలో 20 లక్షల ఎకరాల్లోనే పంట

హైదరాబాద్​, వెలుగు: ఈ వానాకాలం, పోయినేడు యాసంగి సాగు రికార్డులను తిరగరాసేలా ఈ యాసంగిలో రైతులు  వరిని సాగు చేస్తున్నారు. కాలం కలిసి రావడం.. వర్షాలు బాగా పడడం.. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండడం.. పొలాల్లోని బావులు నీటితో కళకళలాడుతుండడంతో  రైతులు వరి సాగువైపే మొగ్గుతున్నారు. సన్నొడ్లు గిట్టుబాటు కాకపోవడంతో.. దొడ్డొడ్ల బాట పట్టారు.  ఈ ఏడాది ఖరీఫ్​లో 45 లక్షల ఎకరాల్లోనే సాగు కాగా.. ఇప్పుడు యాసంగిలో 50 లక్షల ఎకరాలను మించుతుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. మొత్తంగా అన్ని పంటలు కలిపి 60 లక్షల ఎకరాల్లో సాగవుతుందని సర్కారు అంచనాలు వేయగా.. ఇప్పటికే 41.75 లక్షల ఎకరాల్లో పంటలు పడ్డాయి.

11 లక్షల ఎకరాలు ఎక్కువ..

ఈ ఏడాది యాసంగి ప్రారంభంలోనే 31.53 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. మరో 20 లక్షల ఎకరాల్లో నాట్లు పడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఏటా సగటున 22.19 లక్షల ఎకరాల మేర యాసంగిలో వరిని సాగు చేస్తుంటారు. నిరుడు 20.36 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. అయితే, ఈ ఏడాది గత ఏడాదిని మించి 11 లక్షల ఎకరాల్లో అదనంగా రైతులు వరి నాట్లు వేశారు. ఫిబ్రవరి రెండో వారం నాటికి వరి సాగు50 లక్షల ఎకరాలు దాటి రికార్డులు తిరగరాసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

పత్తి రాక..

వానాకాలం పత్తి సాగు రైతులకు కష్టాలు, నష్టాలనే మిగిల్చింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 60.32 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి వేశారు. అయితే, ఆగస్టు, సెప్టెంబర్​ నెలల్లో కురిసిన భారీ వర్షాలు.. పత్తి పంటను ముంచెత్తాయి. వర్షాలకు దెబ్బతిన్న పంట పోగా.. మిగతా పంటపైన ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశే ఎదురైంది. వాటి నుంచి ఆశించినంతగా పూతగానీ, కాతగానీ రాలేదు. అక్టోబర్​లో కాయ నుంచి దూది వచ్చే సమయానికి వర్షాలు మరోసారి ముంచేశాయి. దీంతో ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు వచ్చే పత్తి దిగుబడి.. 2 నుంచి 3 క్వింట్లాళ్లకు పడిపోయింది. దీంతో చాలా మంది రైతులు పంటను దున్నేశారు. సగానికిపైగా పత్తి చేన్లను రైతులు చదును చేసుకుని వరి వేస్తున్నారు. అందుకే వరి లెక్కకు మించి పెరుగుతోందని అంటున్నారు.

దొడ్డొడ్లే వేస్తున్నరు

వానాకాలంలో సన్న వడ్లు సాగు చేసి నష్టాలను మూటగట్టుకున్న రైతులు.. ఇప్పుడు మాత్రం దొడ్డు వడ్ల వైపు మొగ్గారు. ఇప్పుడు దిగుబడి కూడా బాగా వస్తుందని అధికారులు చెబుతున్నారు. వానా కాలంలో ఎకరాకు 22 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తే.. యాసంగిలో 28 నుంచి 30 క్వింటాళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. వాతావరణం అనుకూలించి, కలుపు తక్కువగా ఉండి.. అవసరం మేరకే నీరు పెడితే దిగుబడి పెరుగుతుందని, గింజ గట్టిదనం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

For More News..

ఏపీ అక్రమంగా 86 ప్రాజెక్టులు కడుతోంది

హైదరాబాద్ చుట్టూ పెరుగుతున్న లీజ్ ఫార్మింగ్

రాష్ట్ర చరిత్రలో ఫస్ట్​ టైమ్.. ఒక్క నెలలోనే 850 కోట్ల ఇన్‌కం

కరోనాతో మరణించిన డాక్టర్‌‌‌‌ భార్యకు ఉద్యోగం