వరంగల్ జిల్లాలో గ్రీవెన్స్లో వినతుల వెల్లువ

వరంగల్ జిల్లాలో గ్రీవెన్స్లో వినతుల వెల్లువ

మహబూబాబాద్/ ములుగు/ భూపాలపల్లి రూరల్/ జనగామ అర్బన్, వెలుగు: ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని ఆయా కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్​కు ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో వినతులు వచ్చాయి. మహబూబాబాద్​ ప్రజావాణిలో 97 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్​ అద్వైత్​ కుమార్​ సింగ్​ తెలిపారు. ములుగులో కలెక్టర్​ దివాకర దరఖాస్తులను స్వీకరించగా, 62 వినతులు వచ్చాయని చెప్పారు. జయశంకర్​ భూపాలపల్లిలో 37 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్​ రాహుల్​ శర్మ పేర్కొన్నారు. 

జనగామ కలెక్టరేట్​లో నిర్వహించిన గ్రీవెన్స్​కు వివిధ సమస్యలపై 39 అర్జీలు వచ్చాయని అడిషనల్​ కలెక్టర్​ పింకేశ్​కుమార్​ తెలిపారు. హనుమకొండలో నిర్వహించి ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్​ వెంకట్​రెడ్డి దరఖాస్తులు స్వీకరించి, వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.  

ట్రై సైకిల్​ ఇప్పించండి సారూ..

హనుమకొండకు చెందిన షేక్​ హైదర్​ 55 ఏండ్ల దివ్యాంగుడు. వృద్ధాప్యం మీదపడుతుండడంతో నడవలేని స్థితిలో ఉన్నానని, మూడు నెలల కింద ట్రై సైకిల్​ కోసం ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నాని తెలిపాడు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఇలా అతికష్టం మీద వచ్చి, మరోమారు ట్రై సైకిల్​ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.