Big Boss Telugu 9: బిగ్ బాస్ 9 వీకెండ్ షాక్: డెమాన్‌ పవన్ ఎలిమినేషన్? నాగార్జున క్లాస్‌తో హౌస్‌లో వణుకు!

Big Boss Telugu 9: బిగ్ బాస్ 9 వీకెండ్ షాక్: డెమాన్‌ పవన్ ఎలిమినేషన్? నాగార్జున క్లాస్‌తో హౌస్‌లో వణుకు!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9  రోజుకో మలుపు తిరుగుతోంది. హౌస్ లో కొందరి కంటెస్టెంట్ల ప్రవర్తన ప్రేక్షకులను చిరాకు తెప్పించేస్తోంది.  ఇక ఎనిమిదో వారం వీకెండ్ ఎపిసోడ్ హోస్ట్ నాగార్జున క్లాస్ పీకడంతో అగ్నిపర్వతాన్ని తలపించింది. ఈ వారం హౌస్‌మేట్స్‌ ప్రవర్తన, మాట తీరుపై నాగార్జున ప్రశ్నలు సంధించారు. ఒక్కొక్కరిని నిల్చోబెట్టి ఎడాపెడా వాయించి పడేశారు. హౌస్ లో ఉండాల్సిన పద్దతి ఇదేనా అంటూ క్లాస్ పీకారు.  వారు ప్రవర్తించిన సంబంధించి వీడియోలు  ప్రదర్శించి ఇంటి సభ్యులను, ప్రేక్షకులను షాక్‌కి గురి చేశారు..

 సంజనా - మాధురి: గురివింద గింజ న్యాయం!

ముందుగా నాగార్జున సంజనాతో క్లాస్ మొదలుపెట్టారు. నామినేషన్స్ సమయంలో ఆమె ప్రదర్శించిన కోపం, చిరాకు, ముఖ్యంగా సుమన్‌తో డిస్కషన్ తర్వాత పదే పదే అతడిని "బ్రెయిన్ లెస్, సెన్స్ లెస్, షెటప్" వంటి మాటలు వాడటంపై తీవ్రంగా మందలించారు. నాకు తెలుగు రాదని అంటావ్, కానీ ఇలాంటి మాటలు వాడతావా? అంటూ ఆమెకు హితబోధ చేశారు. ఆ వెంటనే, దివ్వెల మాధురిని నిలబెట్టి.. తప్పు చేసినప్పుడు ఇతరులను విమర్శించడం కాదు, గురివింద గింజ లాగ తన నలుపును మర్చిపోయి ఇతరుల నలుపును ఎత్తి చూపినట్టుగా బిహేవ్ చేయొద్దు అంటూ గట్టి క్లాస్ ఇచ్చారు. సంజనా, మాధురి ఇద్దరికీ ఒకేసారి తప్పులను ఎత్తి చూపడంతో హౌస్‌లో నిశ్శబ్దం ఆవరించింది.

 రేషన్ మేనేజర్ రచ్చ..

తరువాత, రేషన్ మేనేజర్ తనూజ వ్యవహారంపై చర్చ జరిగింది. కెప్టెన్ దివ్యను అడిగినప్పుడు.. హౌస్‌మేట్స్‌కు ఆర్డర్స్ వేసే అధికారం కెప్టెన్‌కు కూడా ఉండదు అని చెప్పింది. ఆపై, కళ్యాణ్‌పై తనూజ నోరేసుకుని పడిపోయిన వీడియోను చూపించి, ఆర్డర్లు జారీ చేయొచ్చా అని ప్రశ్నించారు. అయితే కెప్టెన్ దివ్య వారం మొత్తం కళ్యాణ్‌దే తప్పు, తనూజని విసిగించాడు అంటూ కళ్యాణ్‌ను తప్పుబట్టింది. కళ్యాణ్ కూడా తనూజ గురించి అభిప్రాయం చెప్పకుండా  దాటవేయడంతో, అతడి నిజాయితీపై నాగార్జున పెదవి విరిచారు.

డెమాన్‌ పవన్‌కు బిగ్ షాక్! 

ఎపిసోడ్‌లో అత్యంత సంచలనాత్మక ఘట్టం డెమాన్‌ పవన్ - రీతూ చౌదరిల వ్యవహారం. టాస్క్ సమయంలో రీతూ చౌదరిని బెడ్ మీదికి తోసేసి 'మ్యాన్ హ్యాడ్లింగ్' చేసిన వీడియోను నాగార్జున ప్లే చేశారు. ఆ వీడియో చూసి నాగార్జున తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. చేతిలో బెల్టును చూపించి మరీ.. ఇలాంటి బిహేవియర్ మీ ఇంట్లో ఆడపిల్లలపై చేస్తే మీరు బెల్టు పెట్టి కొట్టేవారా కాదా? అంటూ నేరుగా ఆడియన్స్‌ను అడిగారు. ఆడియన్స్ 'కరెక్ట్ కాదు సార్' అని చెప్పడంతో, నాగార్జున ఉగ్రరూపం చూపించారు.

 సారీ చెప్తే బిగ్ బాస్ క్షమించడు. నీకు రెడ్ ఫ్లాగ్ తప్పదు. నీ బ్యాక్ ప్యాక్ చేసుకో. బిగ్ బాస్ ఓపెన్ ది డోర్! అంటూ డెమాన్‌ పవన్‌ను తక్షణమే ఎలిమినేట్ చేస్తున్నట్టు ప్రకటించారు. పవన్ షాక్‌లో ఉండగా, రీతూ చౌదరి ఒక్కసారిగా లేచి సార్ సార్.. వద్దు సార్ అంటూ ప్రాదేయపడింది.. రీతూ అభ్యర్థనను బిగ్ బాస్ ఎలా పరిగణించారు? పవన్ నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా? లేక ఇది కేవలం హెచ్చరికా? అనే ఉత్కంఠ ఈ వారాంతపు ఎపిసోడ్లలో కొనసాగనుంది.