ఈ-రిక్షాలకు రెడ్ సిగ్నల్

ఈ-రిక్షాలకు రెడ్ సిగ్నల్

హైదరాబాద్, వెలుగు: ఈ–రిక్షాలు (ఎలక్ట్రిక్ ఆటోలు) నగరంలో తిరిగేందుకు సిటీ పోలీసులు మెకాలాడ్డుతున్నారు. దాదాపు రెండున్నరేళ్లుగా రవాణా శాఖ ఎన్నిసార్లు కోరినప్పటికీ వారి నుంచి అనుమతులు రావటం లేదు. దీంతో నగర రోడ్లపై ఈ–రిక్షాలు ఇప్పటికీ కనిపించడం లేదు. గ్రేటర్ పరిధిలో ఈ–రిక్షాల రిజిస్ట్రేషన్ ను నిలిపివేశారు. ఈ అంశంపై పోలీసులు, రవాణా శాఖ అధికారుల మధ్య రెండున్నరేళ్లుగా చర్చలు సాగుతూనే ఉన్నాయి. తాజాగా రవాణా శాఖ అధికారుల విజ్ఞప్తికి పోలీసులు మళ్లీ నో చెప్పినట్లు సమాచారం. వాస్తవానికి పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు ఎలక్ట్రిక్ వా హనాలను పెద్ద ఎత్తున పెంచేందుకు కేంద్రం ఎన్నో ప్రోత్సహకాలను ప్రకటిస్తోంది. మొన్నటి బడ్జెట్ లోనూ ఈ వాహనాలు కొనుగోలు చేసే వారికి భారీగా రాయితీలు ప్రకటించింది. ఓ వై పు ఈ–వాహనాలను పెంచే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే మరోవైపు హైదరాబాద్ రోడ్లపై మాత్రం ఈ–రిక్షాలను అడ్డుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఐతే  ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్ లో వాహనాల విస్పోటానాన్ని వీలైనంత వరకు తగ్గించాల్సి ఉంది. గత నాలుగేళ్లలోనే 40 నుంచి 60 లక్షల వరకు వాహనాల సంఖ్య పెరిగింది. ఇకనైనా మేలుకొనకపోతే పొల్యూ షన్ విషయంలో ఢిల్లీకి పోటీగా తయారవటం ఖాయం.

స్పీడ్, డెన్సిటీ పేరుతో అడ్డుకుంటున్న పోలీసులు

నిజానికి వాహనాల పొల్యూషన్​ను తగ్గించేందుకు ఇప్పుడున్న ఏకైక ప్రత్యామ్నాయం ఎలక్ట్రిక్ వాహనాలే. క్రమంగా పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఎల్పీజీ వాహనాల స్థానంలో ఎలక్ర్టిక్ వాహనాలను పెంచాల్సి ఉంది. ఐతే ఈ దిశగా అధికారులు కృషి చేయటం లేదు. దీంతో గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం 2,500 వరకు మాత్రమే ఎలక్ర్టిక్ వాహనాలున్నాయి. ఇక ఆటోల విషయానికొస్తే గ్రేటర్ పరిధిలో లక్షా 50 వేలకు పైగా ఆటోలు సీఎన్జీ, ఎల్జీపీ ఇంధనాలతో నడుస్తున్నాయి. వీటి ద్వారా కాలుష్యం భారీగానే వెలువడుతోంది. వీటి స్థానంలో కొత్తగా ఈ–రిక్షాలు వస్తే పెద్ద ఎత్తున కాలుష్యం తగ్గే అవకాశం ఉంది. కానీ పోలీసులు చెబుతున్న కారణాలు వేరేలా ఉన్నాయి. ఈ–రిక్షా ల సగటు వేగం 25 కిలోమీటర్లు మాత్రమేనని, వీటిని రోడ్లపై అనుమతిస్తే చాలా నెమ్మదిగా ప్రయాణిస్తాయని చెబుతున్నారు. పైగా వాహనాల డెన్సిటీ సైతం పెరగటం కారణంగా రోడ్లపై ట్రాఫి క్ సమస్యలుంటాయని చెబుతూ రెండున్నరేళ్లుగా వీటిని రోడ్లపైకి ఎక్కకుండా అడ్డుకుంటున్నారు.

పోలీసుల కారణాలపై విమర్శలు

ఈ–రిక్షాలు వస్తే ఉండే సమస్యలపై పోలీసులు చెబుతున్న కారణాలపై పర్యావరణ వేత్తల నుంచి విమర్శలు వస్తున్నాయి. అసలు హైదరాబాద్ నగరంలో గంటకు వాహనాల సగటు వేగమే 18 కిలోమీటర్లని వారు చెబుతున్నారు. అలాంటప్పుడు ఈ రిక్షాల వేగం తక్కువ ఉన్నప్పటికీ సగటు వేగంలో ఎలాంటి మార్పు ఉండదంటున్నారు. పైగా వాహనాల సాంద్రత పెరుగుతుందనటం కూడా సరికాదంటున్నారు. వాహనాల సంఖ్య భారీగా పెరగుతున్నప్పటికీ అదే స్థాయిలో రోడ్ల విస్తరణ లేని కారణంగా సాంద్రత పెరుగుతుందని.. దానికి ఈ–రిక్షాలతో లింక్ పెట్టటం సరికాదంటున్నారు. ఇందుకు ఢిల్లీని ఉదాహరణగా చూపుతున్నారు. పొల్యూషన్ తగ్గించేందుకు అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ వీటిని ప్రోత్సహిస్తోన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దాదాపు రెండున్నర లక్షలకు పైగా ఈ–రిక్షాలున్నాయి. అయినప్పటికీ అక్కడ ఎలాంటి సమస్యలు లేవంటున్నారు.

పర్మిట్ల గోల ఉండదు

ఈ–రిక్షాలు వస్తే హైదరాబాద్ లో జోరుగా సాగుతున్న పర్మిట్ల దందాకు అడ్డుకట్ట పడు తుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్, మెహదీపట్నం, మలక్ పేట, తిరుమలగిరి, చాంద్రాయణ గుట్ట ఆర్టీఏ కార్యాల యాల పరిధిలో కొత్తగా ఆటో కొనుగోలు చేయాలంటే పాత ఆటోను స్క్రాప్ చేయాలనే నిబంధన ఉంది. ఆటో రిక్షాల సంఖ్యను పెంచకూడదన్న ఉద్దేశంతో ఈ నిబంధన తెచ్చారు. దీంతో చాలా మంది కొత్తగా ఆటో కొనుగోలు చేయాలనుకునే వారు పాత ఆటో కోసం ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో పాత ఆటో కొనుగోలు చేసి స్క్రాప్ చేయటం కొత్త ఆటోను కొనుక్కోవటానికి ఏకంగా 3 లక్షల రూపాయల వరకు డ్రైవర్లు ఖర్చు చేయాల్సి ఉంటోంది.
నిజానికి లక్షా 60 వేలు ఖరీదు చేసిన ఆటోను 3 లక్షల రూపాయలకు కొనుగోలు చేయాల్సి ఉంటోంది. అదే ఈ రిక్షాలను అనుమతిస్తే ఈ పర్మిట్ల గోల లేకుండా ఉంటుందని చెబుతున్నారు.

ఈ రిక్షాలతో ప్రయోజనం

  •  ఈ- రిక్షాలతో ప్రధానంగా పొలుష్యన్ భారీగా తగ్గుతుంది
  •  వీటి ధర ఆటో రిక్షాల ధర కన్నా తక్కువగా ఉంటుంది
  •  టాప్ రూపింగ్ తో అందమైన డిజైన్స్ ఉంటాయి
  •  6 గంటలు రీఛార్జ్ చేస్తే చాలు 6,0-70 కిలోమీటర్ల వరకు ప్రయాణం.
  •  ప్యాసింజర్స్ కు ప్రయాణ ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి.
  •  ఇంధనానికి చేసే ఖర్చు పెద్ద ఎత్తున తగ్గుతుంది
  •  హైదరాబాద్ లో పర్మిట్ల బెడద ఉండదు