మూడో రోజూ  తగ్గిన డీజిల్ రేటు

మూడో రోజూ  తగ్గిన డీజిల్ రేటు

మారని పెట్రోల్ రేట్లు 
న్యూఢిల్లీ: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు డీజిల్ ధరను శుక్రవారం 20 పైసలు తగ్గించాయి. దీంతో ఢిల్లీలో డీజిల్ లీటరుకు రూ. 89.27 లకు తగ్గింది. దేశ రాజధానిలో ఈ నెల 18,19 తేదీల్లోనూ డీజిల్ రేట్లు 20 పైసల చొప్పున తగ్గించారు. అయితే ఈ ఏడాది జూలై 17 నుండి పెట్రోల్ రిటైల్ ధర  రూ. 101.84లుగా కొనసాగుతూనే ఉంది. తాజాగా డీజిల్ ధర కూడా ముంబైలో 20 పైసలు తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ లీటరుకు రూ. 96.84 వసూలు చేస్తున్నారు. పెట్రోల్ ధర లీటరుకు రూ. 107.83లు ఉంది. ముంబైలో ఈ ఏడాది మే 29 న మొదటిసారిగా పెట్రోల్ రూ. 100 మార్క్ దాటింది. చెన్నైలో గత మూడు రోజుల్లో డీజిల్ ధరలు 55 పైసలు తగ్గాయి. ప్రస్తుతం ఇక్కడ డీజిల్  రిటైల్ ధర రూ. 93.84 ఉంది. కోల్‌‌‌‌కతాలో ఆగస్టు 18 నుండి డీజిల్ ధరలు 70 పైసలు తగ్గడంతో లీటరు రేటు రూ. 93.32లకు పడిపోయింది. హైదరాబాద్‌‌‌‌లో డీజిల్‌‌‌‌ ధర లీటరుకు రూ.93.77లకు తగ్గింది. పెట్రోల్ ధరలు చివరిగా జూలై 17 న పెరిగాయి. మే 4 నుంచి  జూలై 17 మధ్య పెట్రోల్ ధర లీటరుకు రూ. 11.44 పెరిగింది. ఈ కాలంలో డీజిల్ ధరలు రూ. 9.14 వరకు పెరిగాయి.