న్యూఢిల్లీ: ఐటీ సెక్టార్‌లో ఉద్యోగ నియమకాలు భారీగా పడిపోయాయి. స్టార్టప్‌లు కూడా హైరింగ్ చేపట్టడం తగ్గించేశాయి. ఐటీ, స్టార్టప్‌లలో హైరింగ్ యాక్టివిటీ ఐదేళ్ల దిగువకు పడిపోయిందని ఎనలిస్టులు చెబుతున్నారు. కొత్తగా ఉద్యోగులను తీసుకోవడంలో ప్రయోజనం కనిపించకపోవడం, ఇప్పటికే భారీగా నియమకాలు చేపట్టడం, లేఆఫ్స్ కొనసాగుతుండడం వంటివి నియమకాలు తగ్గిపోవడానికి కారణంగా ఉన్నాయని కంపెనీలు చెబుతున్నాయి.
ఐటీ సెక్టార్, స్టార్టప్‌లలో ఉద్యోగాలకు డిమాండ్ పడిపోయిందని, కాంట్రాక్ట్ స్టాఫ్ డిమాండ్ 40 శాతం తగ్గిందని ఎనలిస్టులు పేర్కొన్నారు. కిందటేడాదితో పోలిస్తే ప్రస్తుతం జాబ్ ఎన్విరాన్‌మెంట్‌లో తేడా కనిపిస్తోందని విప్రో చీఫ్ హ్యూమన్ రీసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ పేర్కొన్నారు. గ్లోబల్‌గా ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడం, అట్రిషన్ రేటు తగ్గడం వంటి కారణాలతో హైరింగ్ యాక్టివిటీకి బ్రేక్‌లు పడ్డాయని వివరించారు.
చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. ముఖ్యంగా స్టార్టప్‌లు ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌లో స్టార్టప్‌లలో ఉద్యోగుల డిమాండ్ ఏడాది ప్రాతిపదికన 40 శాతం మేర పడిపోయిందని పేజ్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ హెడ్ అన్షుల్ లోధా పేర్కొన్నారు. 251 మంది ఉద్యోగులను తీసేశామని మీషో ఈ నెల 5 న ప్రకటించింది. కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో వీరి వాటా 15 శాతానికి సమానం. ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ కిందటి వారం 3,500 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేసింది.
ఈ ఏడాది మార్చి 30 న అన్‌అకాడమీ తమ ఉద్యోగుల్లో 12 శాతం మందిని తీసేస్తున్నామని ప్రకటించింది. కంపెనీలు నియమాకాలు చేపట్టడానికి ఆత్రుత పడడం లేదని సీఐఈఎల్ హెచ్‌ఆర్ సర్వీసెస్ సీఈఓ ఆదిత్య నారాయణ్ మిశ్రా పేర్కొన్నారు.
