సాధారణ ప్రసవాల మాటే ఎత్తడం లేదు

సాధారణ ప్రసవాల మాటే ఎత్తడం లేదు
  • కాసుల కోసం కడుపుకోతలకు అలవాటుపడ్డ ప్రైవేటు డాక్టర్లు
  • కాన్పుల్లో 75శాతం సిజేరియన్లే
  • ప్రైవేటు ఆస్పత్రుల్లో నూరుశాతం సిజేరియన్లే

నిజామాబాద్: జిల్లాలో  సాధారణ ప్రసవాలు పూర్తిగా తగ్గాయి. కాసుల కోసం కక్కుర్తి పడుతున్న కొందరు ప్రైవేటు డాక్టర్లు కడుపు కోతలకు అలవాటు పడ్డారు. సిజేరియన్ సర్జరీలు చేయకపోతే ప్రాణాలు పోతాయని గర్భిణులను భయపెడుతూ క్యాష్ చేసుకుంటున్నారు.  ఒక నెలలో జరిగే ప్రసవాలలో 75 శాతానికిపైగా సిజేరియన్లు ఉన్నాయంటే నిజామాబాద్ జిల్లాలో పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యమిస్తున్నామన్న ప్రజాప్రతినిధుల మాటలు అమలుకు నోచుకోవడం లేదు.

మే నెలలో.. 

గత మే నెలలో జిల్లాలో 1913 కాన్పులు జరిగాయి. ఇందులో 459 మాత్రమే సాధారణ ప్రసవాలు (నార్మల్ డెలివరీలు).  మిగతా 1,444 పెద్దాపరేషన్లు. దీంతో జిల్లాలో కడుపు కోతలు (సిజేరియన్ ఆపరేషన్లు) ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది.  జిల్లాలో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లో నూటికి నూరు శాతం సిజేరియన్లే చేస్తునారని అధికారుల విచారణలో తేలింది. నిజానికి గర్భిణి హాస్పిటల్ కు వస్తే సాధారణ ప్రసవం అయ్యేలా డాక్టర్లు చూడాలి. కానీ చాలా మంది అలా చేయడం లేదన్న విమర్శలున్నాయి. నిజామాబాద్ జిల్లాలో మేలో 76 శాతం, ఏప్రిల్ నెలలో 75 శాతం పెద్దాపరేషన్లు అయ్యాయి.

కాన్పుకు రాగానే ప్యాకేజీ మాట్లాడుకొని..

గర్భిణీకి నొప్పులు వచ్చాక మొదటి కాన్పు అయితే 24 గంటలు, రెండో కాన్పు అయితే 12 గంటలు వేచి ఉండాలి. అయితే గంటలకొద్దీ నొప్పులు భరించలేమంటున్న మహిళల వీక్ నెస్ ను... ప్రైవేట్ డాక్టర్లు క్యాష్ చేసుంటున్నారు. కాన్పుకు రాగానే ప్యాకేజీ మాట్లాడుకొని ఆపరేషన్లు చేస్తున్నారు. 50 వేల రూపాయలకు పెద్ద ఆపరేషన్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.  చిన్న వయసులోనే పెళ్లిళ్లు, రెండూ, మూడు కాన్పులు... అవి కూడా ఆపరేషన్లు కావడంతో అమ్మల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. సిజేరియన్లపై జనంలో అవగాహన లేకపోవడం కూడా ఇందుకు కారణమంటున్నారు డాక్టర్లు. అవసరం లేకున్నా ఆపరేషన్ చేయించుకోవటం మంచిది కాదంటున్నారు. ఆపరేషన్ల ప్రభావం తల్లి పాలపైనా చూపిస్తుందని చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో గర్భిణులు, వారి కుటుంబ సభ్యులను భయపెడుతున్న డాక్టర్ల తీరుపై ప్రజా, మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్  అనవసరంగా సిజేరియన్లు చేస్తున్న డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.