పల్లె దవాఖాన్లలో తగ్గిన పోస్టులు

పల్లె దవాఖాన్లలో తగ్గిన పోస్టులు

హైదరాబాద్, వెలుగు: పల్లె దవాఖాన్లలో మిడ్ లెవల్ హెల్త్ కేర్ ప్రొవైడర్(ఎంఎల్‌‌హెచ్‌‌పీ) పోస్టుల భర్తీకి గతంలో ఇచ్చిన అనుమతులపై ఆర్థిక శాఖ బుధవారం జీవో జారీ చేసింది. హెల్త్ కమిషనర్ విజ్ఞప్తి మేరకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు పనిచేసేందుకు 1,492 మంది ఎంఎల్‌‌హెచ్‌‌పీలను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకునేందుకు పర్మిషన్ ఇస్తున్నట్టు పేర్కొంది. 

అయితే గతంలో 1,569 పోస్టులకు ఆర్థిక శాఖ ప్రాథమిక అనుమతులు జారీ చేయడంతో నవంబర్‌‌‌‌లోనే ఆ ఉద్యోగాలను భర్తీ చేశారు. కానీ ఇప్పుడు 1,492 పోస్టులకు మాత్రమే అనుమతినిస్తున్నట్టు జీవోలో పేర్కొనడంతో గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో మొత్తం 3,206 సబ్ సెంటర్లను పల్లె దవాఖాన్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిల్లో పనిచేసేందుకే ఎంఎల్‌‌హెచ్‌‌పీలను రిక్రూట్ చేస్తున్నారు. ఎంఎల్‌‌హెచ్‌‌పీలుగా ఎంబీబీఎస్ డాక్టర్లు, ఆయుర్వేద డాక్టర్లు, నర్సులకు కూడా అవకాశం ఇస్తున్నారు. డాక్టర్లకు రూ.40 వేలు, నర్సులకు రూ.29 వేల వేతనం చెల్లిస్తున్నారు. తక్కువ జీతం, టెంపరరీ జాబ్ కావడంతో ఎంబీబీఎస్ డాక్టర్లు ఈ పోస్టులపై ఆసక్తి చూపడం లేదు. ఆయుర్వేద డాక్టర్లే ఎక్కువ మంది పోటీపడుతున్నారు. గత నెలలో జరిగిన రిక్రూట్‌‌మెంట్​లో 90 శాతం పోస్టులు ఆయుర్వేద డాక్టర్లకే దక్కాయి.