
Regaal Resources IPO: ఈవారం ప్రారంభం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం తర్వాత మార్కెట్లలో కొత్త ఉత్తేజం నిండింది. ప్రధానంగా వ్యాపారాలను ప్రోత్సహించేందుకు అలాగే దేశంలో వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం జీఎస్టీ రేట్ల తగ్గింపు వంటి పెద్ద ప్రకటనతో ముందుకు రావటం మార్కెట్లకో జోష్ నింపింది. ఈ క్రమంలో లిస్టింగ్ కి వచ్చిన ఐపీవో కూడా అదే స్థాయిలో సూపర్ లిస్టింగ్ ద్వారా పెట్టుబడిదారులకు తొలిరోజే భారీ లాభాలను తెచ్చిపెట్టింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది రీగల్ రిసోర్సెస్ కంపెనీ ఐపీవో గురించే. మెయిన్ కేటగిరీలో వచ్చిన ఐపీవో బీఎస్ఈలో 39 శాతం ప్రీమియం రేటు రూ.141.80 వద్ద ఎంట్రీ ఇవ్వగా ఇక ఎన్ఎస్ఈలో స్టాక్ 38.24 శాతం లాభంతో రూ.141 వద్ద లిస్టింగ్ నమోదు చేసింది. దీంతో తొలిరోజే భారీ లాభాలను పొందారు ఐపీవోపై బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లు. అయితే లిస్టింగ్ తర్వాత పెట్టుబడిదారులు లాభాల బుక్కింగ్ కోసం ఎగబడి విక్రయించటం షేర్లను 5 శాతం తగ్గేలా చేసింది.
కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.306 కోట్లను నేడు విజయవంతంగా సమీకరించింది. ఇందులో రూ.209 కోట్లకు తాజా ఈక్విటీ ఇష్యూ ఉండగా.. మిగిలిన మెుత్తాన్ని ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయించింది. కంపెనీ ఐపీవో ఇష్యూను ఆగస్టు 12 నుంచి ఆగస్టు 14 వరకు పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంచింది. ఈక్రమంలో షేర్ గరిష్ఠ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.102గా ప్రకటించింది. అలాగే లాట్ పరిమాణాన్ని 144 షేర్లుగా ఉంచింది.
కంపెనీ వ్యాపారం..
2012లో స్థాపించబడిన రీగల్ రిసోర్సెస్ లిమిటెడ్ దేశంలో మొక్కజొన్నతో తయారయ్యే ప్రత్యేక ఉత్పత్తులను అందిస్తోంది. రోజుకు 750 టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో పనిచేస్తోంది. కాన్ ఫ్లోర్, గ్లూటెన్, జెర్మ్, ఫైబర్ వంటి ఉత్పత్తులను మెుక్కజొన్న నుంచి తయారు చేస్తోంది. ఇక ఫుడ్ గ్రేడ్ స్టార్చ్ అయిన మొక్కజొన్న పిండి, ఐసింగ్ షుగర్, కస్టర్డ్ పౌడర్, బేకింగ్ పౌడర్ వంటి వాటిని కూడా తయారు చేస్తోంది రీగల్ రిసోర్సెస్.