ఫాంహౌస్​లో కేసీఆర్‌‌.. అమెరికాలో కేటీఆర్

ఫాంహౌస్​లో కేసీఆర్‌‌.. అమెరికాలో కేటీఆర్
  • బీఆర్‌‌ఎస్‌లో కనిపించని లోక్‌సభ ఎన్నికల హడావుడి

హైదరాబాద్, వెలుగు: ‘సారు.. కారు.. పదహారు.. ఢిల్లీలో సర్కార్’ అంటూ గత లోక్‌సభ ఎన్నికల్లో హడావుడి చేసిన బీఆర్‌‌ఎస్‌ ఈసారి మాత్రం ఇంకా సైలెంట్‌ గానే ఉంది. లోక్‌సభ ఎన్నికల విషయంలో కాంగ్రెస్‌, బీజేపీలో కనిపిస్తున్నంత ఉత్సాహం, హడావుడి ఆ పార్టీలో కనిపించడం లేదు. మిగతా పార్టీల కంటే ముందే ఎన్నికల వ్యూహాలు రచించి, టికెట్లు ప్రకటించే అధినేత కేసీఆర్‌ ఈసారి‌ ఫాంహౌస్​కే పరిమితమయ్యారు.

అందరికంటే ముందే రంగంలోకి దిగి ఎన్నికల ప్రచార సభలు నిర్వహించే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌ అమెరికాలో ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత అమెరికా వెళ్లిన కేటీఆర్‌‌, వారం రోజులుగా అక్కడే ఉన్నారు. దీంతో పార్టీ ఆక్టివిటీస్ పెద్దగా కనిపించడం లేదు. మరోవైపు, బీజేపీతో పొత్తు కోసం బీఆర్‌‌ఎస్ ప్రయత్నిస్తోందన్న ప్రచారం రాష్ట్రంలో జోరుగా జరుగుతోంది. ఢిల్లీ స్థాయిలో మంతనాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ విమర్శలు చేసింది.

దీనిపై కేసీఆర్, కేటీఆర్ ఇప్పటివరకూ స్పందించలేదు. దీంతో పార్టీ నాయకుల్లో అయోమయం నెలకొంది. పొత్తు కుదిరితే తమ సీట్లు ఉంటయో, పోతయోనని  సిట్టింగ్ ఎంపీలు, ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. గత ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్ 9 సీట్లను గెలుచుకోగా, బీజేపీ 4, కాంగ్రెస్‌ 3, ఎంఐఎం ఒక సీటులో గెలిచాయి. బీఆర్‌‌ఎస్ మెదక్‌ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన ఎంపీ సీటుకు రాజీనామా చేశారు. పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ప్రస్తుతం బీఆర్‌‌ఎస్‌కు ఏడుగురు సిట్టింగ్ ఎంపీలు మాత్రమే ఉన్నారు.

చివరలో సీట్ల కేటాయింపు!

గత లోక్‌సభ ఎన్నికల్లో, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ అందరికంటే ముందే బీఆర్‌‌ఎస్ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. చాలా వరకూ సిట్టింగులకే సీట్లు ఇచ్చి నష్టపోయారు. బీఆర్‌‌ఎస్ సీట్లు ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ ఆచితూచి అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ కూడా ఇదే పద్ధతి అనుసరించింది. కేసీఆర్ టికెట్లు కేటాయించిన తీరుపై ఇంటా, బయటా విమర్శలను ఎదుర్కొన్నారు. పార్టీ ఓటమికి గల కారణాల్లో ఇది కూడా ఒక అంశమని నేతలు చెప్పుకొచ్చారు.

ఈ నేపథ్యంలో లోక్‌సభ టికెట్ల ప్రకటనపై తొందరపడొద్దనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు, బీజేపీతో పొత్తులపై కూడా పార్టీ ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే, కనీసం ఓ మంత్రి పదవి వస్తుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ నుంచి రక్షణ దొరుకుతుందని ఆ పార్టీ భావిస్తున్నట్టుగా విశ్లేషకులు చెబుతున్నారు.

బీఆర్‌‌ఎస్‌తో పొత్తుల అంశాన్ని బీజేపీ రాష్ట్ర నేతలు కొట్టిపారేసినప్పటికీ, పార్టీ జాతీయ నాయకత్వం మాత్రం స్పందించలేదు. సీఎం రేవంత్‌ రెడ్డి కూడా ఈ అంశంపై రెండ్రోజుల క్రితం ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌‌ఎస్ పొత్తులపై ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, బీజేపీకి పది, బీఆర్‌‌ఎస్‌ 7 సీట్లకు ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. ఈ వ్యవహారం తేలిన తర్వాత, లేదా బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే తమ అభ్యర్థులను ప్రకటిద్దామని కేసీఆర్ సూచించినట్టుగా బీఆర్‌‌ఎస్ పెద్దలు అంటున్నారు.

సర్వేల్లోనూ ప్రతికూలత

గత ఎన్నికల్లో 9 సీట్లు గెలిచిన బీఆర్‌‌ఎస్, ఈసారి కనీసం రెండు సీట్లు కూడా గెలిచే అవకాశంలేదని కాంగ్రెస్, బీజేపీ ఆరోపిస్తున్నా యి. ఇటీవల వచ్చిన పలు సర్వే రిపోర్టుల్లోనూ బీఆర్‌‌ఎస్ 2 నుంచి 4  సీట్లు మాత్రమే గెలిచే అవకాశం ఉందని పేర్కొన్నాయి.