ఒత్తిళ్లతో డైమండ్  ఆకారంలోకి రీజినల్ రింగ్ రోడ్డు!

V6 Velugu Posted on Apr 10, 2021

  • రీజినల్​ రింగ్​ రోడ్డు పైరవీల​ రూటు
  • ఆర్​ఆర్​ఆర్​ అలైన్​మెంట్​లో తమకు అనుకూలంగా మార్పు​ కోసం నేతల ప్రయత్నాలు
  • తమ భూములు పోకుండా కొందరు.. తమ భూములకు దగ్గరగా తెచ్చుకునేందుకు ఇంకొందరు
  • మంత్రులు, పెద్దాఫీసర్ల చుట్టూ చక్కర్లు
  • సర్కిల్​ షేప్​ నుంచి డైమండ్​ షేప్​కు అలైన్​మెంట్!

టీఆర్​ఎస్​కు చెందిన ఓ లీడర్​ సంగారెడ్డి దగ్గరలో రీజినల్​ రింగ్​ రోడ్డు  వస్తుందన్న ఆశతో భూములు కొన్నాడు. కానీ ఇప్పుడు ఆ భూమికి  దగ్గరగా  ఆర్ ఆర్ ఆర్ ప్రపోజల్ లేదని తెలిసి లబోదిబోమంటున్నాడు. భూములు అమ్మితే తనకు పెట్టుబడి పైసలు కూడా వచ్చేలా లేవని, ఎట్లయినా సరే తన భూములకు దగ్గరగానే  రీజినల్​ రింగ్​ రోడ్డు వెళ్లేలా పైస్థాయిలో లీడర్లను, ఆఫీసర్లను కలిసి పైరవీలు చేస్తున్నాడు. 

గజ్వేల్-–- తూప్రాన్  మధ్య రీజినల్​ రింగ్​ రోడ్డు వస్తుందన్న ముందస్తు అంచనాతో ఆ ఏరియాలో టీఆర్ఎస్  లీడర్​ ఒకరు వందల ఎకరాల భూములు కొన్నాడు. ప్రస్తుతం ప్రపోజల్​ చూస్తే ఆ భూములు ఆర్​ఆర్​ఆర్ లో పోయే అవకాశం ఉంది. దీంతో ఆయన తన భూములను కాపాడుకునేందుకు కీలక నాయకుడి చుట్టూ చక్కర్లు కొడ్తున్నాడు.

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ లీడర్​కు సంస్థాన్ నారాయణపూర్-- – శివన్నగూడ  మధ్య భూములు ఉన్నాయి. వాటికి దగ్గరగా ఆర్​ఆర్​ఆర్ అలైన్ మెంట్ ఉండేలా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ చుట్టూ నిర్మించే రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ ఆర్ ఆర్)పై టీఆర్ఎస్ లీడర్లు, రియల్టర్లు కన్నేశారు. ఏయే ప్రాంతాల మీదుగా  రోడ్డు వెళ్తుందో ఆరా తీస్తున్నారు. రోడ్డు అలైన్​మెంట్ వివరాల కోసం పైరవీలు చేస్తున్నారు. తమకు అనుకూలంగా అలైన్​మెంట్​ను మార్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం కీలక మంత్రుల చుట్టూ చక్కర్లు కొడ్తున్నారు. ప్రగతిభవన్​కు దగ్గరగా ఉండే లీడర్లను మచ్చిక చేసుకుంటున్నారు. ఆఫీసర్లను కాకా పడ్తున్నారు. తమ భూములు ఆర్​ఆర్​ఆర్​లో పోకుండా జాగ్రత్తలు పడే పనిలో కొందరు ఉంటే, తమ భూముల సమీపంగా రోడ్డు వెళ్లేలా చూడాలని మరికొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొందరు రూట్ మ్యాప్ వివరాలు చెప్పాలని, దానికి తగ్గట్టు భూములు కొనుక్కుంటామని అంటున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్​ఆర్ఆర్​కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో రోడ్డు అలైన్​మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ చేసి కేంద్రానికి పంపనుంది. ఈ విషయం గ్రహించిన టీఆర్ఎస్ లోని రియల్టర్లు, ఇతర రియల్ ఎస్టేట్ సంస్థల అధిపతులు రోడ్డు అలైన్​మెంట్​ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పైరవీలు చేస్తున్నారు.

కాకా పడ్తున్నరు
మెజార్టీ టీఆర్ఎస్ లీడర్లు రియల్ ఎస్టేట్ బిజినెస్ లో పార్టనర్లుగా ఉన్నారు. కొందరు మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు బిజినెస్ ను తమ బంధువుల పేరుతో కొనసాగిస్తుండగా, ఇంకొందరు రియల్ కంపెనీల్లో  స్లీపింగ్ పార్టనర్స్‌గా ఉన్నట్టు ప్రచారంలో ఉంది. వీళ్లు తమ రియల్ ఎస్టేట్ బిజినెస్ కు లాభం కలిగేలా రోడ్డు మ్యాప్​ చేయించేందుకు పైరవీలు చేస్తున్నారు. మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ‘‘అన్నా.. ఫలానా ఏరియాల వందల ఎకరాల భూములు కొన్నం. జర ఆ భూములకు దగ్గరగా రోడ్డు పడేలా చూడుండ్రే ’’ అని అడుగుతున్నట్టు తెలిసింది. మున్సిపల్, హెచ్ఎండీఏ, ఆర్ అండ్ బీ ఆఫీసర్ల చుట్టూ కూడా తిరుగుతున్నట్లు తెలిసింది.

ఒత్తిళ్లతో డైమండ్  ఆకారంలోకి రింగ్ రోడ్డు
గతంలో ఫైనల్ చేసిన రింగ్ రోడ్డు వృత్తాకారంలో ఉండేదని, ప్రస్తుత ప్రపోజల్ చూస్తుంటే డైమండ్ ఆకారంలోకి  మారే చాన్స్ ఉందని అధికారులు అంటున్నారు. అలైన్​మెంట్​లో మార్పులు ఎక్కువగా ఉమ్మడి మెదక్, నల్గొండ జిల్లాల్లో జరగొచ్చని చెబుతున్నారు. గతంలో గజ్వేల్–- నాచారం – -శివంపేట– -నర్సాపూర్ –సంగారెడ్డి మీదుగా రోడ్డు డిజైన్  చేయగా.. ప్రస్తుతం దాన్ని గజ్వేల్– తూప్రాన్​– -హత్నూర్– -సంగారెడ్డికి కలిపేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. గజ్వేల్– -జగదేవ్​పూర్– -తుర్కపల్లి– -భువనగిరి– -వలిగొండ-–చౌటుప్పల్ వరకు డిజైన్ చేయగా.. ప్రస్తుతం దాన్ని గజ్వేల్-– ఆలేరు– -మూటకొండూర్-– సంగెం-– చౌటుప్పల్ కు కలిపేలా మార్పులు చేస్తున్నట్టు సమాచారం. ఈ  ఏరియాల్లో టీఆర్ఎస్ లీడర్లు భారీగా భూములు కొన్నారని, వాళ్ల కోసం రింగ్‌ రోడ్డు  డిజైన్​లో మార్పులు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రెండేండ్ల కింద ఆర్​ఆర్​ఆర్ నిర్మాణంపై ప్రభుత్వం మ్యాప్ ను రెడీ చేసి కేంద్రానికి పంపినా దానిలో మార్పులు తప్పవని ఆఫీసర్లు అంటున్నారు. రింగ్ రోడ్డు ఏ ప్రాంతాల మీదుగా వెళ్లాలో నిర్ణయించేందుకు సీఎం త్వరలో రివ్యూమీటింగ్ పెట్టనున్నారు. 

16,500 కోట్లతో రింగ్‌ రోడ్డు
347 కిలో మీటర్ల పొడవు, 100 మీటర్ల వెడల్పు, 6 లైన్లతో రీజినల్​రింగ్​ రోడ్డును నిర్మించనున్నారు. ఇందుకు రూ. 16,500 కోట్లు ఖర్చు కానుంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల మీదుగా ఆర్​ఆర్​ఆర్​ వెళ్లనుంది. ఇది పూర్తయితే హైదరాబాద్ రాకుండానే బెంగుళూరు–- వారణాసి, విజయవాడ –-ముంబై హైవేలకు లింక్​ ఏర్పడుతుంది. భవిష్యత్తులో 8 లైన్ల రోడ్డు నిర్మాణం జరిగేలా భూసేకరణ చేపట్టనున్నారు.

Tagged Hyderabad, Telangana, Regional Ring Road

Latest Videos

Subscribe Now

More News