మేరా నంబర్ కబ్ అయేగా..వలస కూలీల ఎదురుచూపులు

మేరా నంబర్ కబ్ అయేగా..వలస కూలీల ఎదురుచూపులు

హైదరాబాద్, వెలుగు: లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం సొంతూళ్లకు చేరవేస్తోంది. 40 శ్రామిక్ రైళ్లలో వలస కార్మికులను తరలిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో మంగళవారం ఉదయం నుంచే వారంతా పోలీస్ స్టేషన్ల వద్ద క్యూ కట్టారు. సైబరాబాద్ తోపాటు రాచకొండ, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ స్టేషన్లలో తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఒక్కరోజే సుమారు 5 వేల మంది, ఫిలిం చాంబర్స్ లో 400 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేపట్టారు. పేర్లు నమోదు చేసుకున్నవారు సొంతూళ్లకు వెళ్లేందుకు ‘మేరా నంబర్ కబ్ ఆయేగా’ అని ఎదురు చూస్తున్నారు.

స్టాండర్డ్ ప్రొటోకాల్ పోర్టల్​తో డేటా లింక్

కార్మికులు వెళ్లాల్సిన స్టేట్ వివరాలతోపాటు ఆధార్, ఫోన్ నంబర్ ను స్పెషల్ నోడల్ ఆఫీసర్స్, రైల్వే అధికారులతో ఏర్పాటు చేసిన స్టాండర్డ్ ప్రొటోకాల్ పోర్టల్ తో లింక్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి మొబైల్ నంబర్ కి వచ్చే ఓటీపీతో పేరు రిజిస్టర్ చేస్తున్నారు. పేర్లు నమోదయ్యాక వారిని రాష్ట్రాల వారీగా డివైడ్ చేస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రిజిస్టరైన కార్మికుల డేటా ఆధారంగా ట్రైన్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. శ్రామిక్ రైల్ బయలుదేరే టైం, కార్మికుల వివరాలను రాష్ట్రాలకు ముందే పంపుతున్నారు. సొంతూళ్లకు వెళ్లేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్న కార్మికులకు భోజన సదుపాయాలు కల్పించారు.

ఘట్​కేసర్ నుంచి బయలుదేరిన రెండో రైలు

గత నాలుగు రోజులుగా కలెక్ట్ చేసిన డేటాతో మంగళవారం తెల్లవారుజామున 3.05 గంటలకు ఘట్ కేసర్ నుంచి బీహార్ కగారియాకు రెండో శ్రామిక్ రైల్ బయలుదేరి వెళ్లింది. ఇందులో హైదరాబాద్, రాచకొండ,సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పనిచేస్తున్న1,250 మంది వలస కార్మికులను తరలించారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆధ్వర్యంలో మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ట్రైన్ మూవ్ మెంట్ సమాచారం ఎవరికీ తెలియకుండా సీక్రెట్ నైట్ఆపరేషన్ ప్లాన్ చేశారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వలస కార్మికులను గ్రూపులుగా విడదీశారు. సోమవారం సాయంత్రం స్థానిక డీసీపీలకు కార్మికుల తరలింపు సమాచారం అందించారు. రాత్రి 11 గంటలప్పుడు పాతబస్తీతోపాటు చాదర్ ఘాట్, కుషాయిగూడ, మల్కాజ్ గిరి, కీసర తదితర పోలీస్ స్టేషన్లలో రిజిస్ట్రేషన్ చేసుకున్న బీహార్ కార్మికులను పీఎస్​ల వద్దకు తీసుకొచ్చారు. అర్ధరాత్రి దాటాక  60 బస్సుల్లో వాళ్లను రైల్వే స్టేషన్ కు తరలించారు. థర్మల్ స్క్రీనింగ్ చేసి ట్రైన్ లోకి అనుమతించారు. అందరికీ టిఫిన్​, వాటర్ బాటిల్స్ ఇచ్చారు. తెల్లవారుజామున 3.05కు జాయింట్ కలెక్టర్ ఫ్లాగ్ ఆఫ్ చేసి రైలును ప్రారంభించారు.